Tarakaratna- Balakrishna: బిచ్చగాడు మూవీలో హీరో కొనఊపిరితో ఆసుపత్రి బెడ్ పై ఉన్న అమ్మను కాపాడుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంటాడు . స్వామీజీ చెప్పిన దీక్ష తీసుకొని 48 రోజులు ఒక సాధారణ యాచకుడిగా అజ్ఞాతంలో బ్రతుకుతాడు. ఈ సినిమాను తలపించేలా తారకరత్న కోసం బాలయ్య ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగైనా కొడుకును కాపాడుకోవాలని వైద్యంతో పాటు దైవాన్ని కూడా నమ్ముతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న గుండె 45 నిమిషాల పాటు ఆగిపోయిందట. బాలయ్య మృత్యుంజయ మంత్రం చెవిలో చెప్పాక ఆయన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్న ప్రచారం జరుగుతుంది.

చాలా సమయం మెదడుకు రక్త ప్రసరణ లేకపోవడంతో మెదడులో కొంత భాగం డామేజ్ అయ్యింది. ప్రధాన అవయవాల పనితీరు మెరుగైనప్పటికీ మెదడు పూర్వ స్థితికి రావాల్సి ఉంది. విషమంగానే తారకరత్న ఆరోగ్యం ఉంది. తారకరత్న కోలుకుని తిరిగి రావడం కోసం బాలకృష్ణ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో అఖండ దీపారాధన చేయిస్తున్నారు. అత్యంత కఠినమైన ఈ దీక్షకు పూనున్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతోంది. 44 రోజుల పాటు అఖండ దీపారాధన నిరవధికంగా వెలగనుంది.
ఈ అఖండ దీపారాధన బాధ్యతలు బాలకృష్ణ తన ఏపీకి అప్పగించారట. ఈ అఖండ దీపారాధన కార్యక్రమం తారకరత్నను క్షేమంగా ఆసుపత్రి నుండి బయటపడేలా చేస్తుందని బాలయ్య గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు నందమూరి అభిమానులు ప్రతిరోజూ ప్రార్థనలు చేస్తున్నారు. వారి ఆకాంక్ష నెరవేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రోజురోజుకు తారకరత్న ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నిన్న వైసీపీ లీడర్ విజయసాయిరెడ్డి తారకరత్నను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ప్రస్తుత కండీషన్ గురించి మీడియాతో ముందు చెప్పారు. తారకరత్న గుండె పనితీరు మెరుగైంది. రక్తప్రసరణ బాగుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా కొన్ని నిమిషాలు మెదుడుకు రక్తప్రసరణ జరగలేదు. ఆ కారణంగా మెదడు పై భాగం దెబ్బతింది. అయితే తారకరత్న కోలుకుంటున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. తారకరత్నకు విజయసాయిరెడ్డి వరసకు మామ అవుతారు. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి విజయసాయిరెడ్డి పెదనాన్న. ఆయన భార్య సునందకు అలేఖ్య రెడ్డి తల్లి చెల్లెలు.

తారకరత్న జనవరి 27న కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొనడం జరిగింది. యాత్ర మధ్యలో తారకరత్న కుప్పకూలిపోయారు. ఆయన్ని కుప్పంలో గల స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స జరుగుతుంది.