
Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగే జట్టు ఏదైనా ఉందంటే అది బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మాత్రమే. అత్యంత బలంగా కనిపించే ఈ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు సాధించలేదు. అయితే, జట్టును అభిమానించే అభిమానుల సంఖ్యకు ఏ మాత్రం తక్కువ లేదు. ఈ జట్టుతో లెజెండ్ క్రికెటర్ విరాట్ కోహ్లీది విడదీయరాని అనుబంధం. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే జట్టుకు ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఒకానొక దశలో ఈ జట్టు నుంచి వెళ్లిపోవాలని భావించాడు విరాట్ కోహ్లీ. ఆ విషయాలను స్వయంగా తానే పంచుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక రకంగా చెప్పాలంటే బెంగళూరు చాలెంజర్స్ జట్టుది ఫెయిల్యూర్ ప్రయాణం అనే చెప్పాలి. 15 సీజన్లు పూర్తయి.. 16వ సీజన్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ జట్టు ఒక్కసారి కూడా కప్పు సాధించలేదు. అలా అని ఈ లీగ్ ప్రారంభమైన ప్రతిసారి అనామక జట్టుగా కూడా బరిలోకి దిగదు. టైటిల్ హాట్ ఫేవరెట్ జట్లలో ఇది ఒకటిగా ఉంటుంది. కానీ, ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేక వెనుకబడిపోతోంది. ఈ టీమ్ కు బలం విరాట్ కోహ్లీ కాగా.. ఈ జట్టుకు కొండంత అండగా ఉంటున్నది కూడా విరాట్ కోహ్లీ అభిమానులే కావడం గమనార్హం.
విడదీయరాని అనుబంధం కోహ్లీది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీది విడదీయరాని అనుబంధం. 2008లో ఐపీఎల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఒకే ప్రాంచైజీ తరఫున ఆడుతున్న ఏకైక ఆటగాడు కోహ్లీనే కావడం గమనార్హం. 2013-2021 వరకు తొమ్మిది సీజన్లకు బెంగుళూరు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు కోహ్లీ. ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా జట్టు యాజమాన్యం, బెంగళూరు అభిమానుల హృదయాల్లో అతనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు కప్పు గెలవకపోయినా అతనిని అభిమానులు అంతే బలంగా అభిమానిస్తూ ఉన్నారు. ఐపీఎల్ లో కోహ్లీని బెంగళూరు జట్టు కాకుండా మరో జట్టుకు ఆడటం ఊహించుకోలేని స్థితికి అభిమానులు చేరిపోయారు.

బైటకు వెళ్లిపోవాలని భావించిన విరాట్ కోహ్లీ..
కోహ్లీ మాత్రం ఒకానొక దశలో బెంగళూరు జట్టు నుంచి బయటికి వెళ్లిపోవాలని భావించాడు. టాప్ ఆర్డర్లో కోహ్లీకి అవకాశం లభించకపోవడమే అందుకు కారణమని కోహ్లీ స్వయంగా పేర్కొనడం గమనార్హం. ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో కోహ్లీ ఎక్కువగా ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. దీంతో టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం కోహ్లీకి దక్కలేదు. ఈ పరిస్థితి జట్టు నుంచి బయటికి వెళ్లిపోవాలన్న ఆలోచనకు కారణమైనట్టు కోహ్లీ పేర్కొన్నాడు. ‘ఐపీఎల్ ప్రయాణం అద్భుతంగా ఉంది. బెంగళూరుతో భాగస్వామ్యం, ప్రయాణానికి ఎంతో విలువ ఇస్తాను. తొలి మూడు సీజన్లలో ప్రాంచైజీ నాకు చాలా మద్దతుగా నిలిచింది. ఆటగాళ్లను అట్టిపెట్టుకునే సమయం వచ్చినప్పుడు. ‘ నిన్ను కొనసాగించాలని అనుకుంటున్నాం’ అని తెలిపారు. నేను టాప్ ఆర్డర్లో ఆడాలనుకుంటున్న. భారత తరఫున మూడో స్థానంలో ఆడుతున్నా కాబట్టి అదే నంబర్ లో బ్యాటింగ్ చేస్తా’ అని అప్పుడు రే జెన్నింగ్స్ తో అన్నా.. ‘ సరే నువ్వు మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేస్తావు’ అని అతను బదులిచ్చాడు. అవసరమైనప్పుడు నాపై విశ్వాసం చూపించారు. అప్పుడు అంతర్జాతీయ కెరీర్ లో కూడా ఎదుగుతున్నా. పేరు చెప్పను గాని అంతకు ముందు టాప్ ఆర్డర్లో ఆడే అవకాశం కోసం మరో ప్రాంచైజీని సంప్రదించాను ‘ అని కోహ్లీ పేర్కొన్నాడు. కనీసం నా మాట వినడానికి కూడా ఆసక్తి చూపలేదు ఆ ప్రాంచైజీ అనే కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. అయితే భారత్ కు ఆడుతూ 2011లో సత్తా చాటుతుండడంతో అదే ప్రాంచైజీ ఆటగాళ్ళను అట్టి పెట్టుకోవడానికి ముందు నా దగ్గరకు వచ్చి.. ‘దయచేసి మీరు వేలానికి అందుబాటులో ఉంటారా’ అని అడిగిందని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఆ అవకాశం లేదని, నాకు మద్దతుగా నిలిచిన ప్రాంచైజీ ఎప్పటికీ ఉంటానని బదులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. నాటి విషయాలను కొద్ది రోజుల కిందట ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పంచుకున్నాడు.