Homeజాతీయ వార్తలుUntimely Rains: రైతుకు మిగిలింది కన్నీళ్లే.. నిండా ముంచిన అకాల వర్షాలు!

Untimely Rains: రైతుకు మిగిలింది కన్నీళ్లే.. నిండా ముంచిన అకాల వర్షాలు!

Untimely Rains
Untimely Rains

Untimely Rains: యాసంగి పంటలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వరంగల్, హనుమకొండ, కరీంనగర్‌ జిల్లాల్లో శని, ఆదివారాల్లో కురిసిన వర్షాలకు పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాల్లో రైతులు ఆరబెట్టిన మక్కలు, వడ్లు తడిసిముద్దయ్యాయి. మామిడి కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు విరిగి, తీగలు తెగి కరంటు సరఫరా నిలిచిపోయింది. చెట్లు రోడ్లపై విరిగి పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వడగండ్ల ధాటికి వరి పొలాల్లో వడ్లు నేలరాలిపోవడంతో చేతికి వచ్చిన పంట నోటికి అందకుండా పోవడంపై రైతులు బోరున విలపిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..
వరంగల్‌ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది . పలుచోట్ల రాళ్ల వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. నర్సంపేటలో వరద పారింది. కోత దశలో ఉన్న వరి పొలాలు ఈదురుగాలులు, అకాల వర్షంతో నేలకొరిగింది. వడ్లు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన వడ్లు, మక్కజొన్నలు, మిరప కాయలు తడిశాయి. మామిడి కాయలు నేలరాలాయి. నర్సంపేట మండలం గురిజాలలోని అరటితోటలకు వంగిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. పలు గ్రామాల్లోని ప్రధాన రహదారుల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. నేలకొరిగాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

తీవ్ర నష్టం..
వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలోని బోజెర్వు గ్రామం, హనుమకొండలోని హౌసింగ్‌ బోర్డు, నందిహిల్స్‌ కాలనీలు అకాల వర్షానికి జలమయమయ్యాయి. పిడుగుపడి ధర్మసాగర్‌ మండలం నారాయణగిరిలో రైతులకు సంబంధించిన బర్రెలు మేకలు కోళ్లు పిడుగు పడి రైతులు కూడా మృతిచెందినట్టు తెలిసింది. కమలాపూర్‌ మండలం అంబాలలో ఇండ్లు, పలు రేకుల షెడ్లు నేలమట్టమయ్యాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండి, గంగాధర, కరీంనగర్‌ రూరల్, మానకొండూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లోను శని, ఆదివారాల్లో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. జిల్లా అంతటా ప్రస్తుతం వరి పొలాలు కోత దశకు వచ్చాయి. హార్వెస్టర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు కోతలు చేపట్టడం లేదు. మరోవైపు పంటలు కోసిన రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలతో పొలాలు నేలవాలాయి. వడ్లు రాలిపోయాయి. ఇక కల్లాల్లో పోసిన ధాన్యం కూడా వరదరకు తడిసిపోయింది. చాలా గ్రామాల్లో కల్లాల్లో ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. నేల రాలిన వడ్లను చూసి రైతులు కన్నీరు మున్నీవరుతున్నారు.

Untimely Rains
Untimely Rains

మామిడి రైతుకు తీవ్ర నష్టం..
దాదాపు మూడు నెలలుగా కంటికి రెప్పలా మామిడి కాయలను కాపాడుకుంటున్న రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. ప్రస్తుతం మామిడి కాయలు కోత దశలో ఉన్నాయి. కొంతమంది రైతుల కోపి విక్రయిస్తున్నారు కూడా. ఈ దశలో కురిసిన వర్షానికి కాయలన్నీ రాలిపోయాయి. దీంతో రైతులు రాలిన కాయలు చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. అసలే ఈ ఏడాది వాతావరణ ప్రభావంతో దిగుబడి తగ్గిందని, తాజాగా తమను వరుణుడు పగబట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని మామిడి, వరి రైతులు వేడుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version