
Sajjala Ramakrishna Reddy: వైసీపీలో రెండో ప్లేస్ కుదురుగా కూర్చోనివ్వదు.. నిలకడగా నిలబడనివ్వదు. అక్కడ రెండో ప్లేసే రిటైర్మెంట్ ఫిగర్ అన్నమాట. అక్కడ జగనే సోలో ఫెర్ఫార్మెన్స్ తప్పించి… మరెవరికీ స్థిరమైన స్థానం లేదు. చివరకు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ సైతం తన పదవిని వదులుకున్నారు. వైసీపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుది రెండో ప్లేస్. జగన్ చాలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కానీ ఆ వృద్ధ నేతను జగన్ ఎక్కువ రోజులు నమ్మలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పక్కనపడేశారు. తరువాత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి పక్కకు తప్పించారు. తనతో జైలు జీవితం అనుభవించి,.. వెన్నంటే నడిచిన విజయసాయిరెడ్డికి రెండో ప్లేస్ అప్పగించారు. చాలారోజుల పాటు ఆయన్నే కొనసాగించారు. అటు ఉత్తరాంధ్ర ఇన్ చార్జితో పాటు సోషల్ మీడియా వంటి కీలక విభాగాలను, బాధ్యతలను ఆయన చేతిలో పెట్టేశారు. ఏమైందో.. ఏమో కానీ ఆయన్ను కూడా సైడ్ చేశారు.అటు తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డి సీన్ లోకి వచ్చారు. మిగతా అందరిదీ ఒక ఎత్తు.. సజ్జలది ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది.
నాలుగేళ్లుగా సజ్జలదే హవా..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ సజ్జలకు ప్రాధాన్యత పెరిగింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు మాట్లాడాలన్నా.. ప్రభుత్వం తరుపున వకాల్తా అన్న సజ్జలకే అన్నట్టు రైట్స్ ఉండేవి. చివరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలన్నా సజ్జలే కీలకమయ్యారు. కేబినెట్ కూర్పు, కూడికలు, తీసివేతలు ఇలా అన్నీ సజ్జలే స్వయంగా పర్యవేక్షించే వారు. పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ చీమ చిటుక్కుమన్నా సజ్జలకు తెలియకుండా కాదన్న రేంజ్ లోకి పరిస్థితి వచ్చింది. సజ్జల వ్యూహాలు, సలహాలు సక్సెస్ కావడంతో జగన్ వద్ద ఆయన పరపతి మరింత పెరిగిపోయింది. అయితే పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు కనుక.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సజ్జల వ్యూహం ఫెయిలైంది. అప్పటి నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అది ఆయన్ను పక్కన పడేసే వరకూ వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
ఓటమితో సైడ్ చేసేశారు..
గెలుపు నాది… ఓటమి ఇంకొకరిది అన్నట్టు ఉంటుంది సీఎం జగన్ వ్యవహార శైలి. మొదటి నుంచి ఓ భిన్నమైన శైలి. మొత్తం నిర్ణయాలు తానే తీసుకున్నా… ఆది సలహాదారుల ప్రభావం అన్నట్లుగా కవరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఏ చిన్న మంచి జరిగినా దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. తప్పు జరిగితే మాత్రం సలహాదారులపై తోసేస్తారు. ఇప్పుడు పార్టీకే గడ్డు పరిస్థితి వచ్చినందున సజ్జలను సైతం పక్కన పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా బలిపశువు చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకూ అన్నీతానై వ్యవహరించిన సజ్జల ఒక్కసారిగా కనిపించకపోవడానికి అదే కారణమన్నట్టు ప్రచారం సాగుతోంది. మెల్లగా ఇక సజ్జలకు సీఎం క్యాంప్ ఆఫీసులోకి కూడా ఎంట్రీ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వచ్చే మూడు నెలల్లో సజ్జలకు దారుణమైన పరాభవాలు ఎదురవుతాయని వైసీపీ వ్యవహారాలు.. జగన్ తీరు గురించి అవగాహన ఉన్న నేతలు కామెంట్స్ చేస్తున్నారు.

చెవిరెడ్డి కుదరుకోగలరా?
సజ్జల రామక్రిష్ణారెడ్డి తరువాత ఇప్పుడు రెండో ప్లేస్ ఎవరిదంటే ప్రధానంగా వినిపిస్తున్న పేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన్ను తెచ్చుకునేందుకు జగన్ సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొంత కాలంగా సీఎం జగన్‌కు చెవిరెడ్డి అత్యంత సన్నిహితమయ్యారు. కేబినెట్ లో అవకాశమివ్వకున్నా భాస్కర్ రెడ్డి సంతృప్తిగా ఉన్నారు. అది రెండో ప్లేస్ కోసమేనని ఇప్పుడు అర్ధమవుతోంది. సజ్జలను సైడ్ చేయడంతో చెవిరెడ్డికి జగన్ లైన్ క్లీయర్ చేశారు. ఏం కావాలన్నా చేసి పెడుతున్నారు. చాలా వరకు అంతర్గత వ్యవహారాలు చక్క బెడుతున్నారు. ఇప్పుడు నెంబర్ టు పొజిషన్ ను మార్చాలని నిర్ణయించుకోవడంతోనే చెవిరెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయవద్దని.. తన వద్దకు రావాలని జగన్ పిలుపునిచ్చినట్లుగా చెబుతున్నారు. వారసులెవరికీ టిక్కెట్లు లేవని జగన్ ఖరాఖండిగా చెబుతున్నారు. కానీ చెవిరెడ్డికి మాత్రం ఆయన కుమారుడికే చాన్స్ ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని చెవిరెడ్డి కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని మరీ చెప్పారు. దీంతో వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ధర్మాన, భూమన, పేర్ని కుటుంబ వారసులకే ఇంతవరకూ క్లారిటీగా చెప్పలేదు. కానీ చెవిరెడ్డి విషయంలో మాత్రం జగన్ స్పష్టతనివ్వగలిగారు. అయితే ఇప్పటివరకూ వైసీపీలో సెకెండ్ ప్లేస్ లు అచ్చిరాలేదు. ఇప్పుడు ఆ పోస్టులో చెవిరెడ్డి ఎన్నిరోజులు నెట్టుకు రాగలరో చూడాలి మరీ.