
Mulapeta Port: భావనపాడు పోర్టు పేరు మారింది. ఇక నుంచి మూలపేట పోర్టుగా పిలవాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ పోర్టు నిర్మాణానికి 2012 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయే కానీ కొలిక్కి వచ్చిన దాఖలాలులేవు. అయితే పోర్టు నిర్మాణం కాకున్నా.. భావనపాడు పరిసర ప్రాంతాల్లో నిర్మించనుండడంతో.. అది భావనపాడు పోర్టుగానే సుపరిచితమైంది. అయితే వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత పోర్టు నిర్మాణంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ప్రతిపాదిత స్థలాన్ని మార్చింది. దీంతో పోర్టు పేరు మార్పు కూడా అనివార్యంగా మారింది. బుధవారం పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో భావనపాడు పోర్టు పేరును మారుస్తూ.. మూలపేట పోర్టుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికుల వలవన్ ప్రత్యేక ఉత్తర్వులిచ్చారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో…
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని భావనపాడులో 2014లో రూ.3,669 కోట్ల అంచనా వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మించడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. భావనపాడు, దేవునళ్తాడ, పొల్లాడ, మర్రిపాడు, కొమరల్తాడ, సూర్యమణిపురం గ్రామాల పరిధిలో 7,133 ఎకరాల్లో ప్రతిపాదన చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక సమస్యలు ఇతరత్రా కారణాలతో పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని మార్చింది. సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పంచాయతీ మూలపేట, విష్ణుచక్రం గ్రామాల మధ్య పోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేవలం 1,010 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే నిర్వాసితులుగా మారుతున్న మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలు ప్రభుత్వం ముందు 75 డిమాండ్‌లు ఉంచారు. సర్వం త్యాగం చేస్తున్నందున పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం చేయాలని కోరారు. దీంతో భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇచ్చింది.

మార్పులు అనివార్యం..
కొత్త డీపీఆర్ ప్రకారం పోర్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల కాలనీలు, మౌలిక వసతుల కల్పనలోను మార్పులు అనివార్యంగా మారాయి. పోర్టు నిర్మాణంతో నిర్వాసితులుగా మారిన వారికి సంతబొమ్మాళి మండలం నౌపాడలో 80 కోట్ల రూపాయల అంచనాతో పునరావాస కాలనీని కూడా నిర్మిస్తోంది. మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 600 కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద నిర్మిస్తోన్న ఈ ఇళ్లను మంజూరు చేసింది. ఈ నిర్మాణాలన్నింటికీ సీఎం జగన్ ఈనెల 19న శంకుస్థాపన చేయనున్నారు. అయితే దశాబ్దాలుగా ఉన్న భావనపాడు పోర్టు పేరు మార్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రస్తాయిలో భావనపాడు పోర్టుగానే సుపరిచితం. ప్రజల భావోద్వేగాలతో కూడిన అంశమైన పోర్టు పేరును ప్రజాభిప్రాయం చేపట్టకుండా ఏకపక్షంగా ఎలా పేరు మార్చేస్తారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అంశం మరింత జఠిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.