Media Corruption : అసెంబ్లీకి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బ్యూరో చీఫ్, ఎడిషన్ ఇన్చార్జి, బ్రాంచ్ మేనేజర్ పోటీ చేసే ప్రతి అభ్యర్థి వద్దకు వెళ్తారు. పెయిడ్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుతారు. రాజకీయ నాయకులకు ఎలాగూ సిగ్గు ఉండదు కాబట్టి.. పైగా ఎన్నికల్లో విపరీతమైన ప్రచారం కావాలి కాబట్టి.. ఓకే అంటారు.. డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇక ఆ ఎన్నికల ప్రచార సమయంలో నిబంధనలు ఉండవు. పద్ధతులూ ఉండవు. నెగిటివ్ వార్తలు అసలే ఉండవు. కేవలం పెయిడ్ ఆర్టికల్స్ మాత్రమే నడుస్తుంటాయి. అవన్నీ కూడా పోటీ చేసే అభ్యర్థికి అనుకూలంగా ఉంటాయి.
ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం గుర్తించలేదు. అధికారుల బృందం పసిగట్టలేదు. పైగా ఈ పెయిడ్ ఆర్టికల్స్ వ్యవహారం మొత్తం మేనేజ్మెంట్ నిబంధనల మధ్య సాగుతూ ఉంటుంది. పెయిడ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసినందుకు మేనేజ్మెంట్ కు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు మొత్తం నగదు రూపంలోనే ఇస్తారు. ఆ నగదును కిందిస్థాయిలో పనిచేసే సిబ్బంది అత్యంత జాగ్రత్తగా మేనేజ్మెంట్ కు పంపిస్తారు. ఇదంతా కూడా ముంజేతి కంకణమే. పైగా ఈ క్రతువులో పాలుపంచుకున్న డెస్క్ సిబ్బందికి ఎంతో కొంత వాటా ఇస్తారు. అంటే ప్రతి విభాగంలోనూ ఈ పెయిడ్ వ్యవహారానికి ఆమోదముద్ర లభిస్తుందన్నమాట.
వాస్తవానికి పత్రికలలో ఇటువంటి వ్యవహారాలు మంచివి కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం లాగా ఉన్న మీడియా రక్తపు కూడు కోసం ఇలా దిగజారడం విలువలను నాశనం చేయడమే. ఇలాంటి వ్యవహారాలు మొత్తం దగ్గరుండి చూస్తారు కాబట్టి విలేకరులు కూడా దారి తప్పుతారు. డబ్బు కోసం మేనేజ్మెంట్ నానా గడ్డి కరుస్తున్నప్పుడు.. తాము మాత్రం తప్పు చేస్తే తప్పేంటనే స్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడే వారి ఆలోచన వేరే విధంగా మారుతుంది. అక్రమాలకు దారి తీసే విధంగా పురి కొల్పుతుంది. ఆ పత్రికలో ఓ జిల్లాలో బ్యూరో ఇన్చార్జి, ఎడిషన్ ఇంచార్జి ఓ విలేకరి నుంచి డబ్బులు వసూలు చేయడం.. మరో జిల్లాలో ఓ విలేకరి రెట్టింపు లాభాలు వస్తాయని కోట్లల్లో దండుకోవడం కలకలం సృష్టించాయి. వాస్తవానికి ఇటువంటి ఘటనలు వేరే ఎవరైనా చేస్తే ఆ పత్రిక అద్భుతమైన లేఔట్ తో బీభత్సమైన వార్తలను ప్రచురించేది. కానీ తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఇలా చేయడంతో నిశ్శబ్దంగా ఉండిపోయింది.
పనిచేసే సిబ్బంది తప్పులు చేశారు కాబట్టి వారిపై వేటు వేసి మేనేజ్మెంట్ చేతులు దులుపుకుంది. వాస్తవానికి ఫీల్డ్ లోకి ఎటువంటి వ్యక్తులను తీసుకుంటున్నారు? వారి నేపథ్యం ఏమిటి అనే విషయాలను ఆ పత్రిక యాజమాన్యం పూర్తిగా మర్చిపోయింది. తనకు ఏమిస్తున్నారు అనే కోణంలోనే ఆలోచిస్తోంది. అందువల్లే కింది స్థాయి వ్యవస్థ ఇంతలా గాడి తప్పింది. ప్రతి ఏడాది సర్కులేషన్ టార్గెట్.. యాడ్స్ టార్గెట్ పూర్తి చేస్తే సరిపోతుంది.. విలేకరులు ఎలా పనిచేసినా పర్వాలేదు.. సమాజం మీద పడి దోచుకున్నా పర్వాలేదు.. అనే స్థాయికి ఆ పత్రిక యాజమాన్యం దిగజారింది. పత్రికా యాజమాన్యమే డబ్బు కోసం అడ్డదారులు తొక్కుతుంటే.. కింది స్థాయి విలేకరులు మాత్రం తప్పులు చేయకూడదా? మేనేజ్మెంట్ డబ్బుల కోసం ఎలాంటి పనికిమాలిన పనులైనా చేయవచ్చు.. కింది స్థాయి సిబ్బంది మాత్రం సర్వ పరిత్యాగుల లాగా ఉండాలి. మేనేజ్మెంట్ కోసం మాత్రమే పని చేయాలి. అంతంతమాత్రం జీతాలున్నా.. అత్తెసరు లైన్ అకౌంట్ ఇస్తున్నా అన్నీ మూసుకొని తలవంచాలి. ఇదే ఆ మేనేజ్మెంట్ చెబుతున్న సూక్తి ముక్తావలి. తన సంస్థలలో ఇంతటి దారుణాలు జరుగుతున్నప్పటికీ ఆ పత్రికాధిపతి నోరు మెదపడు. పైగా నీతి వాక్యాలు చెబుతుంటాడు. కాల వైపరీత్యం అంటే ఇదే కాబోలు.