Hydra Ranganath: ఆక్రమణలు లేని.. చెరువులు, నాలాలు కబ్జాకు గురికాని నగరంగా హైదరాబాద్ ను రూపొందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. హైడ్రా వ్యవస్థకు ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన వాహనాలు.. సిబ్బందిని కూడా నియమించారు. ఒకరకంగా హైడ్రా అనే వ్యవస్థ హైదరాబాదులో కీలకంగా పనిచేస్తోంది. ఇప్పటికే అనేక ఆక్రమణలను నేలమట్టం చేసింది. ఇప్పటికే అక్రమ కట్టడాలను పడగొడుతూనే ఉంది. హైడ్రా చేస్తున్న పని వల్ల సమాజం నుంచి సానుకూల స్పందన వస్తోంది. ముఖ్యంగా సంవత్సరాల తరబడి ఆక్రమణలతో విసిగిపోయిన ప్రజలు హైడ్రా రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా అక్రమ కట్టడాలను పడగొట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. హైడ్రా వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం సర్వనాశనం అవుతుందని మండిపడుతున్నారు.
హైడ్రా కూలగొడుతున్న భవనాలు పేదలవేనని.. మధ్యతరగతి వారివి మాత్రమేనని.. పెద్దల జోలికి హైడ్రా వెళ్లడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆమధ్య అమీన్పూర్ ప్రాంతంలో హైడ్రా కొన్ని భవనాలను పడగొట్టింది. ఈ సమయంలో చెరువులను ఆక్రమిస్తే.. అడ్డగోలుగా భవనాలు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధిపతి రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత కాలేజీ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని కాషాయ పార్టీ నాయకులు ప్రస్తావించారు. హైడ్రా అధిపతికి దమ్ముంటే పాతబస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీని పడగొట్టాలని సవాల్ విసిరారు. అయితే దీనిపై హైడ్రా అధిపతి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
ఫాతిమా కాలేజీని ఓవైసీ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా విద్యను బోధిస్తున్నారు. అందువల్లే ఈ కాలేజీని కూల కొట్టకుండా ఉంటున్నామని హైడ్రా అధిపతి స్పష్టం చేశారు. ఎంఐఎం అధినేత తన కాలేజీని చెరువు లోతట్టు ప్రాంతంలో నిర్మించినప్పటికీ.. పేద ముస్లిం పిల్లల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడిపిస్తున్నారని హైడ్రా అధిపతి స్పష్టం చేశారు. పైగా ఈ కాలేజీలో ఎటువంటి ఫీజులు వసూలు చేయడం లేదని.. పదివేల మందికి పైగా ఇక్కడ చదువుకుంటున్నారని తెలంగాణ పేర్కొన్నారు. వెనుకబాటు తనం నుంచి ముస్లిం మహిళలకు ఓవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోందని రంగనాథ్ పేర్కొన్నారు. కాలేజీ కావడం వల్లే దీనిపై చర్య తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు.
Also Read: చంద్రబాబుకు కవిత లేఖ
మరోవైపు మజ్లీస్ నేతల నుంచి 1000 కోట్ల వరకు ఆస్తులను రికవరీ చేశామని పేర్కొన్నారు. 25 ఎకరాల సరస్సును ప్లాటుగా మార్చిన ఓవైసీ కుటుంబానికి చెందిన సన్నిహితుడి కట్టడాలను పడగొట్టామని రంగనాథ్ పేర్కొన్నారు. రంగనాథ్ చేసిన వ్యాఖ్యల పట్ల భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఫాతిమా కాలేజ్ విషయంలో ఉదారత చూపిన మీరు.. మిగతా పేదల విషయంలో ఎందుకు చూపించలేకపోయారని గులాబీ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఓవైసీ కాలేజీ మీద చూపించిన ప్రేమ రాళ్లు వేయించేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు..
రంగనాథ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నాయకులు కూడా మండిపడుతున్నారు. చెరువులో కాలేజీ కట్టి.. విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నామంటే ఎలా? రేపటి నాడు చాలామంది ఇలాగే చెరువులో కట్టడాలు కట్టి.. ఉచితంగా చదువు చెబుతున్నామంటే ఒప్పుకుంటారా? దానికి హైడ్రా అధిపతి సమ్మతం తెలుపుతారా అంటూ బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఫాతిమా కాలేజీ మీద హైడ్రా అధిపతి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో.. విమర్శలే అధికంగా వస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.