Media Accountability : భయపెట్టి సర్కులేషన్ చేస్తే అభినందించారు. సాక్షాత్తు పత్రికాధిపతి బహుమతి అందించి, ఫోటో దిగారు. బెదిరించి ప్రకటనలు తీసుకొస్తే మేనేజ్మెంట్ దగ్గరికి తీసింది. గొప్పగా చేశాడంటూ కితాబిచ్చింది. ఆ విలేఖరికి ఉన్నది ఒకటే బీట్. పైగా అందులో వార్తలు రాయడు. వార్తలు రాసే సన్నివేశం కూడా అతడికి లేదు. అయినప్పటికీ మేనేజ్మెంట్ చెప్పిన దానికంటే సర్కులేషన్ ఎక్కువ చేస్తాడు. యాడ్స్ కూడా ఎక్కువ తీస్తాడు. ఇక్కడ యాడ్స్ ఇచ్చే వారి పేర్లు ఉండవు.. కేవలం సంస్థకు వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పి.. ఇట్లు జిల్లా ప్రజలు అని ఉంటుంది. వాస్తవానికి ఇటువంటి ప్రకటనలు ఏ కేటగిరి కిందికి వస్తాయో ఆ పత్రికా యాజమాన్యమే చెప్పాలి.
సదరు విలేఖరి ఆ పత్రికలో మార్కెట్ విభాగం చూస్తుంటాడు. ఆ మార్కెట్ విభాగంలో పెద్దగా వార్తలు రాయడు. రాసే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వడు. పైగా ఆ విలేఖరికి ఆ జిల్లాలో పనిచేసే పెద్ద తలకాయ సపోర్టు విపరీతంగా ఉంది. అందువల్ల అతడు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. నగరంలో వెజిటేబుల్స్ దుకాణం దక్కించుకోవడానికి ఆ విలేఖరి చేసిన దారుణం ఇప్పటికి ఆ జిల్లా కేంద్రంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఓ వ్యాపారిని బెదిరించి.. తన తన భార్యతో అతడిని చెప్పుతో కొట్టించాడు. అప్పట్లో ఈ సంఘటన పెను సంచలనానికి దారితీసింది. ఈ విషయాన్ని ఆ పత్రిక అధిపతికి చెప్పడానికి ఆ వ్యాపారి ప్రయత్నించగా.. కింది స్థాయిలో ఒప్పందం కుదిరింది. పైగా ఆ పత్రికలో పనిచేసే పెద్ద తలకాయ ఆ విలేఖరికి అనుకూలంగా సెటిల్మెంట్ చేశాడు. ఇప్పటికీ ఆ అపరాధ భావాన్ని ఆ వ్యాపారి మర్చిపోలేక పోతున్నాడు. మార్కెట్, కూరగాయల దుకాణంతో ఆ విలేఖరి దందాలు ఆగిపోతే బాగుండేది. కానీ అంతకుమించి అనే రేంజ్ లో తన అక్రమాలను ఆ విలేకరి పెంచుకున్నాడు.
రాత్రిపూట మెలకువతో ఉండడం.. పగటిపూట పడుకుని ఉండడం ఆ విలేఖరి నైజం. అందువల్లే అతడిని ఆ జిల్లా కేంద్రంలో నిశాచర పాత్రికేయుడు అని జర్నలిస్ట్ సర్కిల్స్ లో పిలుస్తుంటారు. ఇటీవల అతడు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ప్రచారం చేశాడు. కోట్లకు కోట్లు వసూలు చేశాడు. కొంతమందితో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు. తన దందా సక్రమంగా సాగడానికి మేనేజ్మెంట్ కు బిస్కెట్లు వేశాడు. టార్గెట్ విధించిన దానికంటే ఎక్కువ పేపర్లు చేశాడు. మేనేజ్మెంట్ చెప్పిన దానికంటే ఎక్కువ యాడ్స్ చేశాడు. తద్వారా మేనేజ్మెంట్ దృష్టిలో రాముడు మంచి బాలుడు అనే తీరుగా ముద్రపడ్డాడు. ఆ పత్రికాధిపతి నుంచి బహుమతి కూడా స్వీకరించాడు. ఈ ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టుకొని.. స్టేటస్ గా పెట్టుకొని ఆ విలేకరి సృష్టించిన సంచలనం అప్పట్లో అంతా ఇంతా కాదు. ఆవిలేఖరికి ఆ పత్రికలో పనిచేస్తున్న పెద్ద తలకాయ సపోర్టు విపరీతంగా ఉంది. అందువల్లే అతడి దందాలకు అదుపు అనేది లేకుండా పోయింది. అతడు వార్తలు రాయడం లేదని ఎడిషన్ ఇన్చార్జి లేదా బ్యూరో ఇన్చార్జి కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేకుండా ఆ పత్రిక పెద్ద తలకాయ చేశాడు. అతని అక్రమాలకు కొమ్ముకాశాడు. ఆ ధైర్యంతోనే ఆ విలేఖరి దండిగా సంపాదించాడు. చివరికి సైబర్ పోలీసుల దర్యాప్తులో సదరు విలేఖరి దొరికిపోయాడు. ఏకంగా మూడు రాష్ట్రాలలో అతని పేరు మీద కేసులు నమోదయ్యాయంటే అతని దందా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆ విలేకరిని ఆ మేనేజ్మెంట్ తొలగించింది. అంతేకాదు అతడిని ఇంకెప్పుడు తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ మేనేజ్మెంట్ ఒకసారిగా సుద్దపూసలాగా మారిపోయింది. మరి ఇన్ని రోజులపాటు ఆ విలేకరి వార్తలు రాయకున్నా.. కనీసం తన శాఖకు సంబంధించిన సమాచారం బ్యూరో చీఫ్ కు చెప్పకున్నా.. మేనేజ్మెంట్ ఎందుకు పట్టించుకోలేదు . సర్కులేషన్.. యాడ్స్ చేస్తే సరిపోతుంది అనుకుందా.. రిపోర్టర్ గా ఉన్న వ్యక్తి సమాజం మీద పడి దోచుకున్నా పర్వాలేదు.. ఇవ్వాల్సినవి ఇస్తున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అనుకుందా.. పైగా ఆ పత్రిక యజమాని గొప్ప గొప్ప నీతులు చెబుతుంటాడు. సమాజంలో తనంతటి నీతిమంతుడు లేడని వ్యాఖ్యానిస్తుంటాడు. కానీ అతడు సంస్థలో పనిచేసే వారు మొత్తం ఇదిగో ఇలానే ఉంటారు.