TDP- Janasena Alliance: వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీని గద్దె దించడం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బలయమైన, అధికార పార్టీకి దీటైన అభ్యర్థులను బరిలోకి దించేలా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పొత్తుల విషయంలోనూ ఆచితూతి అడుగేస్తున్నారు పవన్. అయితే ఇప్పటి వరకు పొత్తుల గురించి అధికారికంగా ప్రకటించలేదు. బీజేపీతో కలిసి పనిచేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని వైసీపీ ప్రచారం చేస్తోంది. పొత్తు పెట్టుకునేలా పరోక్షంగా పవన్‌ను ప్రోత్సహిస్తోంది. ఒక వేల టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరితే మాత్రం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కలిస్తే వైఎస్సార్ సీపీపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.

ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు..
ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి గురించి, నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడరని, ఉద్దేశపూర్వకంగానే కొన్ని అంశాలను తెరపైకి తీసుకువచ్చి ప్రధానమైన విషయాలను పక్కదారి పట్టిస్తున్నారని, ఇది కూడా ఒక స్ట్రాటజీ కావొచ్చని తెలిపారు.
ప్రజలను బిజీగా ఉంచుతున్నారు..
ప్రతి పార్టీకి అనుబంధంగా బలమైన సోషల్ మీడియా విభాగం ఉందని, ఉద్దేశపూర్వకంగా తెరపైకి తెచ్చిన అంశాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారతాయని జేడీ అభిప్రాయపడ్డారు. వీటివల్ల ప్రజల్ని బిజీగా ఉంచుతున్నార ని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్‌పై మరో నటుడు వైసీపీ నేత అలీ పోటీ చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని, అవి చేసేవారి స్థాయిని దిగజారుస్తాయని, ప్రభుత్వ విధానాలు, ప్రజల సమస్యల గురించే మాట్లాడాలన్నారు.

జేడీ అంటే జనతా దోస్త్
తన పేరు ముందు ఉండే జేడీ అంటే జనతా దోస్త్ అనే అర్థం కూడా వస్తుందని, తమ ఫౌండేషన్‌కు జాయింట్ ఫర్ డెవలప్‌మెంట్ అని పేరు పెట్టినట్లు చెప్పారు. టీడీపీ–జనసేన మధ్య పొత్తు కుదిరితే సీట్ల పంపకాలు ఎలా ఉంటాయి? సమీకరణాలు ఎలా మారతాయన్నది చూడాలన్నారు. ఇక ముందస్తు ఎన్నికలపై మాట్లాడుతూ పరిపాలించడానికి ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారని, పాలించలేమని భావిస్తే చేతులు ఎత్తేయాలన్నారు. అలా చేతులెత్తేస్తే మళ్లీ ఎన్నికల్లో పోటీచేయవద్దని పేర్కొన్నారు.
పాదయాత్రలు చేయడంలో తప్పులేదు..
నారా లోకేష్ పాదయాత్రపై జేడీ స్పందించారు. ఉమ్మడి ఏపీలో వైఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారని, చంద్రబాబు, జగన్, షర్మిల కూడా పాదయాత్రలు చేశారని, ప్రజల సమస్యలు తెలియడం రాజకీయ నేతలకు ముఖ్యమని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతుంటాయని, కాబట్టి సమస్యలపై అవగాహన ఉంటే వాటి పరిష్కారానికి కూడా సులువవుతుందన్నారు.
బరిలో ఉంటా..
గత ఎన్నికల సమయంలో జేడీ జనసేన తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి మరోసారి బరిలో ఉంటానని ప్రకటించారు. తన భావాలకు, ఆలోచనలకు తగినట్లుగా ఉండే పార్టీని ఎంచుకుంటానన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో తనకు ఏ పార్టీ నచ్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు.