Kadapa Politics: కడప జిల్లా నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి పిలుపు రాగానే కండువా కప్పుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. వైసీపీతో విసిగిపోయిన నేతలు.. ప్రత్యామ్నాయంగా టీడీపీని ఎంచుకుంటున్నారు. చేరికలతో టీడీపీ కార్యకర్తలు జోష్ లో ఉన్నారు.

కడప జిల్లాలో డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి కీలక నాయకులు. 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. ఫలితంగా మైదుకూరులో డీఎల్ మద్దతుతో రఘురామిరెడ్డి గెలిచారు. కమలాపురంలో వీరశివారెడ్డి మద్దతుతో జగన్ మేనమాన రవీంద్రనాథ్ రెడ్డి గెలిచారు. కమలాపురం, మైదుకూరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ గెలవడానికి డీఎల్, వీరశివారెడ్డిలు కృషి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఇద్దరి నేతలకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో వైసీపీ అధిష్టానం పట్ల గుర్రుగా ఉన్నారు. టీడీపీ నుంచి హామీ లభించడంతో సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.
మార్చిలో టీడీపీలో చేరుతున్నట్టు వీరశివారెడ్డి వెల్లడించారు. తనతో పాటు డీఎల్ రవీంద్రరెడ్డి కూడ టీడీపీలో చేరుతారని తేల్చిచెప్పారు. జగన్ పాలన వల్ల ఏపీ 20 ఏళ్లు వెనక్కిపోయిందని వీరశివారెడ్డి తెలిపారు. జగన్ పాలన పై ప్రజలు విసిగిపోయారని వీరశివారెడ్డి చెప్పారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ తో చర్చించినట్టు తెలిపారు. వీరశివారెడ్డి టీడీపీలో చేరితే టీడీపీ బలం కచ్చితంగా పెరుగుతుంది. గ్రామాల్లో వీరశివారెడ్డికి బలమైన కేడర్ ఉంది. ఈ నేపథ్యంలో వీరశివారెడ్డి, డీఎల్ రవీంద్రా రెడ్డిల చేరిక టీడీపీకి ప్లస్ అవుతుంది.

డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గ్రామస్థాయిలో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో వైసీపీకి సపోర్ట్ చేశారు. దీంతో మైదుకూరు టీడీపీ చేతిలో నుంచి జారిపోయింది. లేదంటే 2019లో మైదుకూరు స్థానం టీడీపీ ఖాతాలో పడేది. డీఎల్, వీరశివారెడ్డితో పాటు సీనియర్లైన ఆదినారాయణ రెడ్డి, వరదరాజుల రెడ్డి కూడ టీడీపీ వైపు చూస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి అయ్యారు. జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తర్వాత జగన్ ప్రభుత్వం రావడంతో ప్రతీకార చర్యలకు దిగుతారని బీజేపీలో చేరారు.
జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి అన్న కొడుకు భూపేష్ పోటీలో ఉన్నారు. 2024లో అన్న కొడుకును గెలిపించుకునేందుకు ఆదినారాయణ రెడ్డి సైకిల్ ఎక్కుతారని కడప జిల్లాలో ప్రచారం జరుగుతోంది. బీజేపీతో అవసరం తీరడంతో ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు వైపు చూస్తున్నారని తెలుస్తోంది. నాడు కేసులు, జగన్ భయంతో బిజెపిలో చేరిన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు అవన్నీ తొలగిపోవడం.. ఎన్నికల సమయం దగ్గర పడటంతో రాజకీయ భవిష్యత్తు కోసం టిడిపిలో చేరుతున్నట్టు తెలుస్తుంది. ప్రొద్దుటూరుకు చెందిన వరదరాజుల రెడ్డి కూడ సైకిల్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయనకు అనుచర వర్గం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ రాకపోవడంతో టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మరో దారి లేక టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.