
Ganga Pushkaralu 2023: పన్నెండేళ్లకోసారి నదులకు పుష్కరాలు వస్తుంటాయి. ఒక్కో నదికి ఒక్కోసారి వస్తుంటాయి. ఇందులో గంగ, గోదావరి, కావేరి, తుంగభద్ర, గౌతమి వంటి నదులు ఉన్నాయి. పుష్కర స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి పుష్కర స్నానం చేస్తే పన్నెండు నదుల్లో పన్నెండు సార్లు స్నానం చేసినట్లేనని నమ్ముతారు. ఇలా పుష్కర స్నానంపై మన హిందూ మతంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి.
నదులకు మేద్యం, మార్జనం అనే రెండు శక్తులుంటాయి. మేద్యం అంటే మనం నదీ స్నానం చేసి తరువాత అందులో మూడు మునకలు వేయడం, మార్జనం అంటే నదీ జలాలను మీద చల్లుకోవడం. ఇలా రెండు చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే మనకు నదీస్నానం అత్యంత శ్రేయస్కరం అని మన వేదాలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గంగానదీ పుష్కర స్నానం అత్యంత శక్తి వంతమైందని చెబుతారు. ఈ కాలంలో మనం చేసే తపం, యాగం, తర్పణం, దానం, జపం, హోమం వంటి వాటికి విశేషమైన ఫలితాలుంటాయి. గతించిన పిత్రు దేవతలకు గంగానదిలో విడిచే తర్పణాలతో మనకు ఎంతో పుణ్యం వస్తుందని చెబుతున్నారు. విశేషమైన ఫలితం వస్తుందని నమ్ముతుంటారు.

అందుకే గంగానది పుష్కరాలకు వెళ్తుంటారు. ఇసుకతో కానీ మట్టితో కానీ పార్థివ లింగాన్ని తయారు చేసి పూజిస్తుంటారు. నదీ తీరంలోని ఇసుకను మూడు దోసిళ్లలో నదిలోకి విసిరేస్తే పుణ్యం వస్తుందంటారు. పురోహితులు భక్తుల తలపై మూడు దోసిళ్లలో నీళ్లు పోసి దీవిస్తుంటారు. ఇలా గంగానదిలో పుష్కర స్నానం అత్యంత పుణ్యంతో కూడుకున్నదని నమ్ముతారు. దీని కోసం
అందరు తరలి వెళ్తుంటారు. పుష్కర స్నానం అత్యంత శక్తివంతమైందని వారి విశ్వాసం.