
AP Politics : ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అప్పుడే వైసీపీ ఇంటింటికి స్టిక్కర్ల రాజకీయం మొదలుపెట్టింది. ఇప్పటికే రోడ్డునపడి టీడీపీ భావి వారసుడు లోకేష్ తెగ తిరుగుతున్నారు. జనసేనాని కూడా ఇక బస్సు యాత్రకు రెడీ చేసుకుంటున్నారు. ఇంకా ఏడాది ఉన్నా కూడా ఏపీలో అప్పుడే ఎన్నికల కోలాహలం నెలకొంది. పార్టీలు నిప్పు రాజేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో రాజకీయం సెగలు కక్కుతోంది..విమర్శలు, ప్రతి విమర్శలతో పార్టీల నేతలు వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే.. రాజకీయ హడావుడి మాత్రం మొదలైపోయింది. ముఖ్యంగా ఏపీలో వాతావరణం ప్రస్తుతం ఏమైనా ఎన్నికలు జరుగుతున్నాయా… అనిపించేలా ఉంది. దీనికి కారణం అధికార.. ప్రతిపక్ష పార్టీల ఎత్తులు.. పై ఎత్తుల అంశాలే కారణం గా తెలుస్తుంది. నిత్యం ఏదో ఒక వివాద రాజకీయ అంశంతో జనాలపై పడుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల హడావిడి ప్రస్తుతం ఏపీలో మొదలై పోయింది. సాధారణంగా ఎన్నికలకు ముందు జనాల్లోకి వెళ్లే పని విపక్షాల నేతలు చేపడుతుంటాయి. రాష్ట్రంలో మాత్రం అధికార పక్షం మొదలు పెట్టింది. ఎన్నికలు బాగా దగ్గరపడ్డాక మాత్రమే పార్టీ ముందుకొచ్చి… ప్రభుత్వం వెనక్కు వెళుతుంది. రాజకీయాల్లో సహజంగా జరిగే ప్రక్రియ. అంతవరకూ మాత్రం ప్రభుత్వంలో ఉంటారు. కానీ గత కొద్ది రోజుల నుండీ పార్టీ కీలక సమావేశాల్లో సీయంతో పాటు, మంత్రుల కంటే జిల్లా అధ్యక్షులు, కో-ఆర్డినేటర్‌లే, సీనియర్ నాయకులు నానాహడావిడి చేస్తున్నారు. ఎన్నికల హడావుడికి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు జగన్ ఈ మద్యన చేస్తున్న సమావేశాలు, ప్రత్యేక మీటింగ్ లే కారణం అంటున్నారు. రానున్న ఎన్నికలకు ఆ విధంగా ఆయన రోడ్ మ్యాప్ క్యాడర్ కి ఇచ్చేసినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతి సమావేశంలో సీఎంగా తనకు మంచి గ్రాఫ్ ఉందన్న ముఖ్యమంత్రి జగన్, ప్రస్థుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మందికి తక్కువ శాతం కంటే తక్కువ గ్రాఫ్ ఉందని హెచ్చరిక సైతం ఆ మద్యన చేశారు. సరిగ్గా గ్రాఫ్ పెంచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇవ్వడం కుదరదన్న సంకేతాలు ఎన్నో సార్లు ఇచ్చేశారు. దీంతో గడప గడపకూ… మన ప్రభుత్వం పోగ్రాం పై మరింత పోకస్ పెట్డారు ఎమ్మెల్యేలు. నిత్యం ప్రజలతోనే ఉండాలని నియోజక వర్గాలు తిరుగుతున్నారు…
జగన్ ఇప్పటికే 175 సీట్లను గెలుచుకునేలా పార్టీ అంతా కష్టపడాలి అంటూ అల్టిమేటం ఇచ్చిని విషయం తెలిసిందే. సీఎం కూడా ఇకపై అన్ని జిల్లాలు పర్యటించ డానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. అలా జరిగితే ఎన్నికల హడావిడి ఏంటీ… ఒక రకంగా కోలాహలంగా నే ఉంటుంది ఆ పార్టీ కేడర్ కు. పైకి ఎన్నిచెప్పినా ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత అనేది తప్పదు. అయితే అది రాష్ట్రంలో కాస్త ఎక్కువగానే పెరుగుతున్నదనే విశ్లేషణలు ప్రస్తుతం అధికార పార్టీ లోనూ ఉంది.

వరుసగా పెరిగిపోతున్న చార్జీలు, పన్నులు, నిత్య అవసరాల ధరలు పెరగడం, ఆ మద్యన వంట గ్యాస్ ధర పెరగడం…. సంక్షేమ పథకాల్లో ఆంక్షలూ, హద్దే లేకుండా పెరిగిపోతున్న రాష్ట్ర అప్పులూ ఇవన్నీ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలు కావడానికి కారణం అని ఎనలిస్టులూ, మాజీ ఉన్నతాధికారులూ చెబుతూ వస్తున్నారు. ఈ వ్యతిరేకత మరింత ముదరక ముందే ఎన్నికలకు వెళితే ఫలితం ఉంటుందని వైసీపీ అధినేత భావిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అలా ఏం ఉండదు షెడ్యూల్డ్ ప్రకారం ఎన్నికలు ఉంటాయి అనే వారు ఉన్నారు.
గతంతో పోలిస్తే ఏపీలోని విపక్షాలు జోరు పెంచుతున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్షం టిడిపీ దొరికిన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండగా…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే స్పీడ్ లో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. రోజురోజుకీ లోకేష్ పాదయాత్ర మంచి ఫలితాలను ఇస్తుంది. అడుగడుగునా లోకేష్ పాదయాత్రను ప్రజలు స్వాగతం చెబుతూ…. వారి సమస్యలను చెప్పుకుంటూ ప్రభుత్వం పైన ఉన్న అవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతే దీటుగా ప్రజలతో మమేకమైన లోకేష్…. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు.
ఇక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ వేదికగా ప్రత్యేక సమీక్షలు సమావేశాలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఐదు జోన్లుగా విభజించి గెలుపే లక్ష్యం గా వచ్చే ఎన్నికలకు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు సైతం మరి కొద్ది రోజుల్లో మరోసారి ప్రజల్లో కి రాబోతున్నారు. ఇక నియోజకవర్గాల్లో ఇప్పటికే తెలుగుదేశం ఇంటింటికి తిరగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికి నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆ నాయకులే ఆ కార్యక్రమాన్ని ఆల్రెడీ ప్రారంభించేశారు.
ఈ హడావిడి రాయలసీమ జిల్లాల్లో కాస్త ఎక్కువగానే ఉంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పునవర్తి నాని, శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మరో రెండు మూడు రోజుల్లో గడపగడపకు ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల పైన అడిగి తెలుసుకోనున్నారు. మిగిలిన కడప కర్నూలు అనంతపూర్ జిల్లాలో కూడా ప్రస్తుతానికి తామే అభ్యర్థులంటూ చెప్పుకుంటున్న నేతలే గడపగడపకు కార్యక్రమానికి ప్రారంభిస్తున్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయ దుందుభి ప్రదర్శించిన తెలుగుదేశం ఆ రకంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేయాలనే ఆశతో, ఉద్దేశంతో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగానే అసలు పార్టీలో అధినేత… నియోజనక అభ్యర్థులను ఇంకా డిక్లేర్ చేయకముందే నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి ఇన్చార్జిలుగా ఉన్న నాయకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికి తిరిగేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం. మొత్తం మీద ఏ పార్టీ ఎవరితో కలిసిన ఎవరు ఎవరికి పొత్తులు ఇచ్చిన…. రెండు ప్రధాన పార్టీల మధ్యనే వచ్చే ఎన్నికలలో అసలైన రాజకీయం ఉండ నుంది.