
Delhi Liquor Scam- Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిబిఐ వేగంగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసింది. రేపో, మాపో కవితను అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.. మరోవైపు సిబిఐ ఇంతవరకు దాఖలు చేసిన చార్జిషీట్ లలో కవిత పేరు ప్రస్తావించింది.. అంతేకాదు గతంలో ఆమెకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన బోయినపల్లి అభిషేక్ రావు ని కూడా సిబిఐ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే కవితని కూడా కటకటాల పాలు చేసేందుకు సిబిఐ పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగబోతోందని సమాచారం.
ఇప్పుడు కవిత గనుక అరెస్టు అయితే రాజకీయంగా కేసిఆర్ కు, భారత రాష్ట్ర సమితికి ఇబ్బంది.. అందుకే దీనిని డైవర్ట్ చేసేందుకు కొత్త ప్లాన్ వేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరుకానున్నారు.. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టనున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ఢిల్లీ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. మరోవైపు కవిత కూడా వీలు చిక్కిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు.. మహిళా బిల్లును ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకు గుర్తుకు వచ్చింది
వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయారు. పైగా ఆ మధ్య వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన డిబేట్లో మా నాన్నను చూస్తేనే నరేంద్ర మోడీకి భయం అంటూ ఏవేవో చెప్పారు గానీ.. ఇప్పటికీ సిబిఐ అధికారుల విచారణ అంటే కవిత భయపడుతున్నారు. మొదట్లో విచారణకు కూడా ససేమీరా అన్నారు. తర్వాత ఓ ఐఆర్ఎస్ అధికారి సూచనతో విచారణకు రమ్మన్నారు.. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఇప్పుడు.. తన సొంత పార్టీలో ఈ మేరకు అవకాశాలు కల్పిస్తున్నారో చెప్పడం లేదు.. 2014 ఎన్నికల్లో ఆరుగురికి, 2018 ఎన్నికల్లో నలుగురి మహిళలకు మాత్రమే భారత రాష్ట్ర సమితి టికెట్లు ఇచ్చింది.. భారత రాష్ట్ర సమితి తొలి ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో పద్మ దేవేందర్ రెడ్డి కి డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆమెకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు.. ఇక 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కు మాత్రమే మంత్రులుగా అవకాశం కల్పించారు..

పక్కదారి పట్టించేందుకేనా?
లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారని ఉద్దేశంతోనే దానిని పక్కదారి పట్టించేందుకు మహిళ రిజర్వేషన్ బిల్లు అంశాన్ని తెరపైకి తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లు మహిళా బిల్లు మీద ఒక్క మాట కూడా మాట్లాడని బిఆర్ఎస్ ప్రభుత్వం.. అకస్మాత్తుగా దీనిపై ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. మొన్నటికి మొన్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో కవిత సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు అందరూ చూశారు. కానీ ఈ విషయం మీద ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ఆత్మహత్య చేసుకున్న ప్రీతి విషయంలోనూ, రాష్ట్రంలో జరిగిన అమానుష ఘటనల్లోనూ స్పందించలేదు.. కానీ ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం మహిళా బిల్లును తెరపైకి తెస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సొంత పార్టీలోనే మహిళా స్వామ్యం లేదని, దాని గురించి కవిత ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తున్నాయి.