
Mukesh Ambani- AP Global Summit: విశాఖలో జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను సక్సెస్ చేయాలని వైసీపీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. తొలి నాలుగేళ్లు పారిశ్రామికరంగాన్ని గాలికొదిలేసిందన్న అపవాదును జగన్ సర్కారు సొంతం చేసుకుంది. దానిని చెరిపేసేందుకు జగన్ భారీ ప్లాన్ రూపొందించారు. పారిశ్రామిక దిగ్గజాలను విశాఖకు రప్పించి కీలక ఒప్పందాలు చేసుకోవడానికి భారీ కసరత్తే చేశారు. దీనికి దేశంలోనే బిగ్ షాట్ అయిన ముఖేష్ అంబానీ ని ఉపయోగించుకున్నారు. సౌత్ ఇండియాలో ఏ సమ్మిట్ కు ముఖేష్ అంబానీ హాజరైన సందర్భాలు లేవు. అవసరమైతే కొంత మంది డైరెక్టర్లను పంపించేవారు. అయితే ఈసారి విశాఖ సమ్మిట్ కు ఏకంగా తాను రావడంతో పాటు 17 మంది డైరెక్టర్లను తీసుకొచ్చి భారీ ప్రదర్శనకే దిగారు. అయితే ఓ పారిశ్రామికవేత్తగా ఏ ప్రయోజనం లేకుండా చేయరు. అయితే ఈ విషయంలో అటు జగన్ కు ఇటు అంబానీకి ఉభయ ప్రయోజనాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.
అప్పుడెప్పుడో తాడేపల్లి ప్యాలెస్ కు విచ్చేసిన ముఖేష్ అంబానీకి ఘన స్వాగతమే లభించింది. ఏకంగా ఆతిథ్యమివ్వడమే కాకుండా ఆయన కోరిన వెంటనే అంబానీ సన్నిహితుడు పరిమళ నత్వానీకి రాజ్యసభ అడిగారు. ఆయన అడిగిందే తడవు జగన్ కూడా రాజ్యసభ ప్రకటించేశారు. దీంతో వారి మధ్య బంధం గట్టిపడింది. ఇప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్ లో దానికి బదులు తీర్చుకున్నారు ముఖేష్ అంబానీ. బిజీ షెడ్యూల్ లో ఏ రాష్ట్రానికి ఇవ్వని ప్రాధాన్యత ఏపీకి ఇచ్చారు. పారిశ్రామికరంగంలో అభివృద్ధి లేదన్న అపవాదు నుంచి జగన్ ను బయటపడేయ్యాలన్న లక్ష్యంతో తానే రంగంలోకి దిగారు. వైసీపీ సర్కారు కోరిన వెంటనే దానిని సమ్మతించి మరీ ఏపీకి తన మందీ మార్భలంతో దిగారు. తొలిరోజు జగన్ తో ఫొటోలు దిగారు. వైసీపీ మీడియా, సోషల్ మీడియా ప్రచారానికి అనుగుణంగా జగన్ తో సన్నిహితంగా మెలిగారు. వారి ప్రచార ఆర్భాటానికి ఇతోధికంగా సాయపడ్డారు.

జగన్ పూర్వాశ్రమంలో పారిశ్రామికవేత్త. కానీ రాజకీయ పారిశ్రామికవేత్త. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్వల్పకాలంలో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. ఈ క్రమంలో ముంబాయిలోని బిగ్ షాట్స్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇవి కూడా అంబానీకి మరింత దగ్గర చేశాయి.పైగా ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రి. గతంలో ఏపీలో వ్యాపార విస్తరణ చేయాలనుకున్న అంబానీకి పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు అత్యంత క్లోజ్ సర్కిల్ లో ఉన్న జగన్ ఉన్నారు. అందుకే ఆయన అడిగిందే తడవుగా వచ్చేశారు. జగన్ తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. పైగా తన వ్యాపార సామ్రాజ్య విస్తరణకు అవకాశాన్ని జగన్ ఇస్తారని భావిస్తున్నారు. త్వరలో ఒకటో రెండో రాజ్యసభ స్థానాలను అడిగే చాన్స్ ఉన్నట్టు కూడా ప్రచారం సాగుతోంది.
గత ప్రభుత్వ హయాంలోనే ఏపీలో ఎంటర్ కావాలని ముఖేష్ భావించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. కానీ ఇప్పుడు విశాఖ నుంచే తన వ్యాపార విస్తరణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా పరవాడలో భారీ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. అంబానీ అడిగిందే తడువుగా ఏ రంగంలోనైనా ప్రోత్సహించడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈ సదస్సు ద్వారా ఆ ప్రయత్నాలను ముఖేష్ మొదలుపెట్టారు. అటు జగన్ కు కావాల్సింది అదే. పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ముఖేష్ అంబాని వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఏరికోరి ఏపీ వస్తున్నారని ప్రచారం కల్పించి రాజకీయంగా మైలేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ తరుణంలో అంబానీ విశాఖ సదస్సుకు వచ్చి మెప్పించారు. దీంతో ఇది ఉభయతారకంగా మిగిలిందన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది.