BRS Party Strategy Telangana: రాజకీయం అంటేనే వ్యూహం.. ఆ వ్యూహంలో ప్రతివ్యూహం ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం మాత్రం ప్రస్తుతం “పులి వేషం వేసి పిల్లిలా పలకరించినట్టు” తయారైంది. ఏ ఎన్నిక వచ్చినా “ఢీ అంటే ఢీ” అని తొడకొట్టడం.. తీరా సమయం వచ్చేసరికి “అబ్బే.. మాకు ఆసక్తి లేదు” అని చేతులెత్తేయడం గులాబీ బాసులకు అలవాటుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో
సీన్ కట్ చేస్తే.. రాజ్యసభలో ఖాళీ!
మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో తగిలిన దెబ్బ మర్చిపోకముందే తాజాగా రాజ్యసభ ఎన్నికల రూపంలో మరో ‘షాక్’ తగిలింది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోయినా, బయట మాత్రం “అభిషేక్ సింఘ్వీని అడ్డుకుంటాం.. ఫిరాయింపుదారులకు విప్ జారీ చేస్తాం.. రాజకీయం అంటే చూపిస్తాం” అంటూ కేటీఆర్, హరీష్ రావు ఊదరగొట్టారు. తీరా చూస్తే కాంగ్రెస్ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజసం ఉట్టిపడేలా నామినేషన్లు వేశారు. మరి మన బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడయ్యా అంటే.. “వెతుకులాటలో ఉన్నాం” అని సమాధానం వస్తోంది.
ఫామ్‌హౌస్ ‘వ్యూహాలు’.. ఫీల్డ్ లో ‘బేజార్లు’!
గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉండి అప్పుడప్పుడు ఇచ్చే స్టేట్మెంట్లు కార్యకర్తల్లో జోష్ నింపుతాయని అనుకుంటే అవి కాస్తా “గాలి తీసిన బెలూన్”లా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో కేటీఆర్, హరీష్ రావులు ఎంతగా కష్టపడుతున్నా, ప్రజలు మాత్రం “అధికారం ఉన్నప్పుడేమో బయటకి రాలేదు.. ఇప్పుడు మాత్రం ఫాంహౌస్ దాటి వస్తున్నారా?” అని సెటైర్లు వేస్తున్నారు.
గులాబీ మార్క్ పాలిటిక్స్
“మేము పోటీ చేస్తాం.. గెలుస్తాం” అని ఆశావహులకు ఆశలు చూపించడం.. వాళ్లు కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అయ్యాక, “వ్యూహాత్మకంగా తప్పుకుంటున్నాం” అని ప్లేటు తిప్పేయడం బీఆర్ఎస్ మార్క్ అయిపోయింది.
కేడర్ కు ఏం చెప్తారు సామీ?
ప్రస్తుతం బీఆర్ఎస్ కేడర్ పరిస్థితి ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’లా మారింది. అధిష్టానం చెప్పే మాటలు వింటేనేమో అతివిశ్వాసం కనిపిస్తోంది.. రిజల్ట్స్ చూస్తేనేమో అట్టడుగున ఉంటున్నారు. “కాంగ్రెస్ పరువు తీస్తాం” అని వెళ్తే చివరకు సొంత పార్టీ పరువు కాపాడుకోవడమే గగనమైపోతోంది.
రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకోవడం ద్వారా “మా దగ్గర బలం లేదు” అని బీఆర్ఎస్ అఫీషియల్‌గా ఒప్పేసుకున్నట్లయింది. మరి ఈ ‘మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తూ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి బీ-టీమ్ అవుతారో లేక నిజంగానే మళ్లీ పుంజుకుంటారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ పాలిటిక్స్‌లో కాంగ్రెస్ ‘హస్తం’ పైచేయి సాధిస్తుంటే కారు మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తోంది!