Hydra demolitions : అక్రమ కట్టడాలను కూల్చివేయడమే లక్ష్యంగా ఏర్పాటైంది హైడ్రా. నిత్యం ఏదో ఒక మూలానా పదుల సంఖ్యలో కట్టడాలను నేలమట్టం చేస్తోంది. చాలా మంది హైడ్రా చేస్తున్న పనిని మెచ్చుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఇక.. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల నుంచి కూడా ప్రధాన డిమాండ్ వినిపించింది. తమ తమ జిల్లాల్లోనూ హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను కూల్చి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు.
కానీ.. హైడ్రా వ్యవస్థ, దాని పనితీరు బీఆర్ఎస్ పార్టీకి మాత్రం నచ్చడం లేదు. ముందు నుంచీ హైడ్రా చేస్తున్న పనిని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. హైడ్రా నిరుపేదలను టార్గెట్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పొట్టగొడుతోందని దుయ్యబట్టారు. సందర్భం చిక్కినప్పుడల్లా హైడ్రాను కార్నర్ చేస్తున్నారు. అటు.. కూల్చివేతల సమయంలో పలువురు బాధితులు రోదించిన వీడియోలను జతపరుస్తూ సోషల్ మీడియాలోనూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల కూకట్‌పల్లి నల్ల చెరువులో రాజకీయ నేతలు కబ్జాలకు చేసి అద్దెకు ఇచ్చిన వాటిని కూల్చివేశారు. ఆ సమయంలో అక్కడ కొంత మంది అద్దెకు తీసుకున్న బాధితులు రోదించడం మొదలు పెట్టారు. అక్కడ కిందామీద పడి ఏడ్చింది కూడా అద్దెకు తీసుకున్న వారే. షెడ్లను అద్దెకు తీసుకొని తలా ఒక బిజినెస్ చేస్తున్నారు. అలాగే.. అమీన్‌పూరన్, కిష్టారెడ్డి ప్రాంతాల్లోని కూల్చివేతలన్నీ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవే. అవి అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిన హయాంలోనూ కబ్జాలకు గురయ్యాయి.
అయితే.. దీనిపై వెనకాముందు ఆలోచించకుండా బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తుండడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ వైపు హైడ్రా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంటే.. బీఆర్ఎస్ నేతలు ఇలా వ్యవహరించడం కరెక్టు కాదని చాలా మందే అంటున్నారు. ఆ కబ్జాలన్నీ బీఆర్ఎస్ హయాంలో జరగడం.. బీఆర్ఎస్ నేతలే కబ్జాలు చేయడం వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో నిరసన తెలుపుతున్నారనే విమర్శలూ వస్తున్నాయి.
ఇటీవల ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో భారీ వరదలు వచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. వారం రోజులపాటు వారు బురదలోనే ఉండిపోయారు. పునరావాస కేంద్రాలకే పరిమితం అయ్యారు. కానీ.. ఒక్క బీఆర్ఎస్ నేత కూడా వారిని పరామర్శించిన దాఖలాలు లేవు. ఇప్పుడు దానికి ముడిపెడుతూ ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఆపద సమయంలో ఆదుకోవడానికి బయటకు రారు కానీ.. హైడ్రా చేస్తున్న పనిని విమర్శించడానికైతే ముందు ఉన్నారు.
తాము చేస్తున్నదంతా పార్టీకి ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా అని ఏదీ ఆలోచించకుండా విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ చివరకు అభాసుపాలవుతోంది. రోడ్లను, ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారి పట్ల సైలెంటుగా ఉండిపోతే సమర్థిస్తారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము హైడ్రాకు చుక్కలు చూపిస్తున్నామని, ప్రభుత్వానికి నిద్రలేకుండా చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అది బీఆర్ఎస్‌కే మైనస్‌లా మారుతున్నదనే విషయం గమనిస్తే మంచిది..!!