Homeటాప్ స్టోరీస్Journalism Telugu Websites: వార్నీ నీది కాపీ "ముచ్చటే"నా.. కూసింత సిగ్గుపడు వెటరన్ జర్నలిస్టు..

Journalism Telugu Websites: వార్నీ నీది కాపీ “ముచ్చటే”నా.. కూసింత సిగ్గుపడు వెటరన్ జర్నలిస్టు..

Journalism Telugu Websites: మందికి పుట్టిన పిల్లల్ని మన పిల్లలు అనుకోవడం ఎంత తప్పో.. ఎవరో రాసింది.. ఎవరి గోడల నుంచి ఎత్తుకొచ్చింది.. మన సొంతం అనుకోవడం కూడా అంతే తప్పు. ఇలా కటువుగా రాస్తున్నందుకు కాస్త క్షమించాలి. కాకపోతే ఆ వృద్ధ జర్నలిస్టుకు అర్థం కావాలని ఇలా రాయాల్సి వస్తోంది. ఆయన రాతలు మహా క్రిస్పీగా ఉంటాయి. ఆయన వ్యక్తీకరణలు సూదంటూ రాయిలాగా ఉంటాయి. అదంతా ఆయన సొంతమని.. ఆయన రాతలో ఉన్న మహత్యం అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు.. సుద్ద తప్పు. ఆయనది వీరావేశం కాదని.. ఆయన పెన్నావేశం “కంట్రోల్ సీ, కంట్రోల్ వీ” బాపతు అని తేలిపోయింది. ఆయన కాపీ క్యాట్ అని.. మంది గోడల నుంచి ఎత్తుకొచ్చి.. తన సైట్లో పేస్ట్ చేస్తాడని రూడీ అయింది. దీంతో ఆయన బాగోతాన్ని.. అసలు స్వరూపాన్ని ఒరిజినల్ కంటెంట్ రాసిన రచయిత బయటపెట్టాడు. సింపుల్ గా చెప్పాలంటే బట్టలు మొత్తం విప్పి నడి బజార్లో సారీ సారీ ముఖ పుస్తక బజారులో నిలబెట్టాడు.

Also Read: మనల్ని ఎవడ్రా ఆపేది.. స్పీచ్ తో మళ్లీ అదరగొట్టిన పవన్!

ఆయన పేరు బిటి గోవిందరెడ్డి. తెలంగాణ పాత్రికేయ రంగంలో చెప్పుకోదగిన.. చెప్పదగిన జర్నలిస్ట్. వివిధ పత్రికలలో సుదీర్ఘ అనుభవం ఆయనకు ఉంది. మంచి చదువరి.. అద్భుతమైన లేఖరి.. అంతకు మించిన ఆలోచన పరి. విషయానుసారంగా మాట్లాడటంలో.. సందర్భానుసారంగా రాయడంలో ఆయన దిట్ట. ప్రస్తుతం గోవిందరెడ్డి ఎందులోనూ పనిచేయడం లేదనుకుంటా. కాకపోతే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని వ్యాసాలు రాస్తుంటారు. ఇటీవల ఓ వర్తమాన అంశాన్ని సంబంధించి తన అభిప్రాయాన్ని తన ఫేస్బుక్ గోడలో రాశారు. అద్భుతమైన సమాచారంతో.. ఈ కాలపు వ్యక్తీకరణను జోడించారు. ఆ వ్యాసాన్ని చదువుతుంటే అద్భుతంగా అనిపించింది. ఇలా కూడా ఆలోచిస్తారా.. ఇంత లోతుగా విశ్లేషిస్తారా అనిపించింది. సదరు గోవిందరెడ్డి రాసిన వ్యాసాలను చూసిన ఓ వెబ్సైట్ నిర్వాహకుడు కాపీ క్యాట్ లాగా కాపీ చేసేసాడు. ఆయన అనుమతి లేకుండా.. ఆయనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే దర్జాగా వాడేసుకున్నాడు.. ఈ విషయం గోవిందరెడ్డికి ఎవరో చెప్పారు. దెబ్బకు ఆ సీనియర్ జర్నలిస్టుకు ఒక్కసారిగా బాధ కలిగింది. అదేంటి నేను రాసింది ఆయన ఎలా వాడుకుంటాడు అనే ఆగ్రహం కలిగింది.

సీనియర్ జర్నలిస్టు.. అంతకుమించి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి.. వెంటనే ఆ చోర శిఖా మణి ని అంతర్జాలంలోనే లెంపలు వాయించారు… సిగ్గు శరం లేకుండా ఇలా ఎలా కాపీ చేస్తావని బహిరంగంగానే గల్లా పట్టుకొని అడిగినంత పని చేశాడు. అక్కడితోనే ఆయన ఆగలేదు.. ఇటువంటి కాపీ కాట్స్ కు ఎలాంటి స్లిప్పర్ షాట్స్ తో బుద్ధి చెప్పాలో తనను అనుసరించే వారిని అడిగారు. అంతే ఒక్కసారిగా ఆ వెబ్సైట్ నిర్వాకుడు నవరంద్రాలు మూసుకున్నాడు. తను చేసిన తప్పును.. తన కాపీ క్యాట్ నిర్వాకాన్ని బయటకి కనిపించకుండా చూసుకున్నాడు.. అంతేకాదు ఆ వెబ్సైట్ నుంచి వాటిని తొలగించాడు. అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో నా
ఆగిపోలేదు చివరికి సదరు సీనియర్ జర్నలిస్ట్ గోవింద్ రెడ్డి కూడా తన ముఖ పుస్తక గోడల నుంచి.. తాను రాసిన వ్యాసాల పరంపరను తొలగించారు. అయితే ఆ వెబ్ సైట్ నిర్వాహకుడి పేరు ప్రస్తావించకుండానే.. వెబ్సైట్ పేరు మాత్రమే ప్రస్తావించి.. ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్ లు జర్నలిస్ట్ సర్కిల్స్ లో తిరుగుతున్నాయి. మొత్తంగా ఈ ఎపిసోడ్లో ఆ సోది ముచ్చట నిర్వాహకుడు తెలుసుకోవాల్సింది ఒకటే ఒకటి.. ఒక కంటెంట్ రాయాలంటే రాసే జర్నలిస్ట్ తన మెదడును రంగరించాలి. ఆ విషయం గురించి విశ్లేషించాలి. ఆ తర్వాత అందులో ఉన్న లోటుపాట్ల గురించి వివరించాలి. దానిని పాఠకుడికి అనుకూలంగా మలచాలి. ఈ మాత్రం సోయి కూడా లేని ఆయన పేరున్న పత్రికల్లో ఎలా పనిచేశాడు? ఇన్ని సంవత్సరాలపాటుగా వెబ్సైటు ఎలా నిర్వహిస్తున్నాడు.. అంటే అక్కడ కూడా కాపీ పేస్టేనా?!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular