Telangana Group 1 Mains: తెలంగాణలో గ్రూప్-1 నియామక ప్రక్రియ తుది దశకు చేరింది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అప్పటి టీఎస్‌పీఎస్సీ పరీక్షలు నిర్వహించలేదు. ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదా పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసింది. టీజీపీఎస్సీగా మార్చింది. పరీక్షలు కూడా పకడ్బందీగా నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు విడుదల చేసింది. తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితా ప్రకటించింది.
Also Read: రాజీవ్ యువ వికాసం.. అర్హతలు.. నిబంధనలు ఇవే!
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ప్రొవిజనల్ మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల విడుదల చేసింది. 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 21,093 మంది హాజరయ్యారు. అభ్యర్థుల మార్కుల మెమోలు, క్వాలిఫైయింగ్ టెస్ట్ (ఇంగ్లిష్)తో సహా ఆరు పేపర్ల మొత్తం మార్కుల వివరాలను TGPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.ప్రొవిజనల్ మార్కుల జాబితా మార్చి 10 నుంచి 16 వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉండగా, మార్కుల రీకౌంటింగ్ కోసం మార్చి 24 వరకు అవకాశం కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఏడు పేపర్ల మార్కులు, జనరల్ ర్యాంకింగ్స్‌తో కూడిన జాబితాను వెబ్‌సైట్‌లో ప్రకటించారు.
ఏప్రిల్ 5 వరకు అందుబాటులో..
మార్కుల మెమోలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 సాయంత్రం 5 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు TGPSC ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, ఓటీపీతో లాగిన్ చేసి మెమోలను పొందాలి. జనరల్ ర్యాంకింగ్స్ జాబితా ఏప్రిల్ 28 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని TGPSC తెలిపింది. ఎంపికైన వారికి వ్యక్తిగతంగా సమాచారం అందజేస్తారని, అందుకోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. సాంకేతిక సమస్యలు ఎదురైతే 040-23542185, 040-23542187 నంబర్లలో లేదా helpdesk@tspsc.gov.in ద్వారా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది.
స్థానం అంచనా..
జనరల్ ర్యాంకింగ్స్‌తో అభ్యర్థులకు తాము సెలెక్ట్ అయ్యే పోస్టుపై క్లారిటీ వస్తుంది. ఈ ప్రకటన అభ్యర్థులకు తమ స్థానాన్ని అంచనా వేసుకునే అవకాశం కల్పించడంతో పాటు తదుపరి దశకు సన్నద్ధం కావడానికి సహాయపడుతుంది. దీంతో అభ్యర్థులు తమ పోస్టును ఎంపిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.