https://oktelugu.com/

Kothagudem : సోదరుడంటే నీలా ఉండాలి.. పెళ్లిలో సోదరికి ఊహించని బహుమతి.. చూస్తే కన్నీళ్లు ఆగవు.. వైరల్ వీడియో

ఎవరైనా తన సోదరి వివాహం జరిగితే.. ఖరీదైన కానుకలు ఇస్తారు. స్తోమత బాగుంటే బంగారం లేదా కార్లు, బంగ్లాలు గిఫ్టులుగా ఇస్తారు. కానీ ఈ సోదరుడు అందరికంటే భిన్నం. ఇతడు చేసిన పని కూడా అందరికంటే భిన్నం. అందువల్లే వార్తలు లో వ్యక్తయ్యాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 29, 2024 / 06:39 PM IST
    Follow us on

    Kothagudem : కొత్తగూడెం ప్రాంతంలో ఓ వ్యక్తి సింగరేణిలో పనిచేస్తుంటాడు. ఇతడికి భార్య, కుమార్తె, కుమారుడు సంతానం. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదించింది. అయితే గత శనివారం ఆ వ్యక్తి కుమార్తెకు కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో వివాహం జరిపించారు. సోదరి వివాహ వేడుకలను సోదరుడు అంగరంగ వైభవంగా నిర్వహించాడు. విందులో సరికొత్త వెరైటీలు పెట్టి.. తన సోదరికి తండ్రి లేని లోటును తీర్చాడు. అంతేకాదు.. తన స్తోమత మించి కట్న కానుకలు కూడా ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా అతడిలో ఏదో వెలితి.. సోదరికి ఇంకా ఏదో ఇవ్వాలనే తాపత్రయం.. అలా వచ్చిన ఆలోచన అతడిని సరికొత్త మార్గం వైపు ప్రయాణించేలా చేసింది. ఆ తర్వాత అతడిచ్చిన బహుమతి సోదరినే కాదు, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరితో కన్నీళ్లు పెట్టించింది.

    ఏం బహుమతి ఇచ్చాడంటే..

    ఐదు సంవత్సరాల క్రితం చనిపోయిన ఆ సింగరేణి ఉద్యోగి తన కుమార్తె, కుమారుడికి ఉన్నత చదువులు చెప్పించాడు. తాను భౌతికంగా లేకపోయినా.. వాళ్ల మదిలో నిలిచిపోయాడు. ఉన్నత చదువులు చదివిన నేపథ్యంలో.. ఆ వ్యక్తి కుమార్తె, కుమారుడు జీవితంలో ఆర్థికంగా స్థిరపడ్డారు. అయితే తమ తండ్రి తనకోసం అంత త్యాగం చేయడం వల్లే ఇవాళ ఈ స్థానంలో ఉన్నానని భావించి.. అతడు తన సోదరికి తన తండ్రి విగ్రహాన్ని తయారుచేసి పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. అది చూసిన ఆమె కన్నీరు మున్నీరయింది. ఆమె తల్లి కూడా భావోద్వేగానికి గురైంది. వివాహ వేడుకకు వచ్చిన వారంతా ఈ దృశ్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వరుడుతో కలిసి ఆ నవవధువు.. తన తండ్రి విగ్రహం, పక్కనే తల్లిని కూర్చోబెట్టి ఆశీస్సులు తీసుకుంది. ఈ దృశ్యం పెళ్లికి వచ్చిన వారందరినీ కలచివేసింది. ” మా నాన్న మా కోసం ఎన్నో చేశాడు. ఎన్నో త్యాగాల వల్లే ఇక్కడ దాకా వచ్చాం. ఇవాళ నేను, నా సోదరి జీవితంలో ఈ స్థాయిలో స్థిరపడ్డామంటే కారణం మా నాన్నే. అందువల్లే ఆయన జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచాలని ప్రయత్నించాను. నా సోదరికి మా నాన్న విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాను. జీవితంలో ఇంతకు మించిన తృప్తి మరొకటి ఉండదు. మా నాన్న భౌతికంగా మా ముందు లేకపోయినా.. ఈ విగ్రహం రూపంలో సజీవంగా ఉన్నారని భావిస్తున్నాం. మా నాన్న ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఉంటాయని” ఆ యువకుడు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించాడు.