https://oktelugu.com/

Revanth Reddy-KTR : ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్.. ఈ విషయంలో ఏకమయ్యారు

Revanth Reddy-KTR : రాజకీయాలలో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. దీనిని నిరూపించేలా అనేక సంఘటనలు మన దేశ రాజకీయాలలో చోటుచేసుకున్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్రాలు కూడా అతీతం కాదు. కాకపోతే మధ్యలో ఉన్న వారే బకరాలు అయిపోతుంటారు.

Written By: , Updated On : March 22, 2025 / 01:09 PM IST
Revanth Reddy-KTR

Revanth Reddy-KTR

Follow us on

Revanth Reddy-KTR : తెలంగాణ రాష్ట్రంలో సరిగా 15 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. పది సంవత్సరాలపాటు పరిపాలించిన భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజలు కాదనుకున్నారు. అలాగని కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ ఇవ్వలేదు. ప్రతిపక్షానికి సముచిత ప్రాధాన్యం ఇస్తూనే.. అధికార పార్టీకి కాసింత ఎక్కువ గౌరవం ఇచ్చారు. మొత్తంగా చూస్తే బలమైన ప్రతిపక్షాన్ని.. సముచితమైన అధికార పక్షాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న భారత రాష్ట్ర సమితి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పటినుంచి ఇప్పటివరకు బలంగా ఢీకొంటూనే ఉన్నాయి. ఒకటి తప్పులను మరొకరు ఎండగట్టుకుంటూనే ఉన్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణలో ప్రతిరోజు ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. పోటాపోటీగా విమర్శలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేయడం ఈ రెండు పార్టీలకు పరిపాటిగా మారిపోయింది. కేటీఆర్, హరీష్ రావు, కవిత భారత రాష్ట్ర సమితి నుంచి.. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు.

Also Read : ఏకమైన దక్షిణాది రాష్ట్రాలు.. ఏకీభవించిన చంద్రబాబు.. వైసిపి తటస్థం

ఒకే వేదికపై..

ఉప్పు నిప్పులాగా ఉండే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. శనివారం తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, భారత రాష్ట్ర సమితి నుంచి కేటీఆర్, జగదీష్ రెడ్డి వంటి వారు హాజరయ్యారు. ఈ సభకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శాలువా కప్పి ఆహ్వానించారు. కేటీఆర్ కు కూడా శాలువా కప్పి గౌరవించారు. ఇక తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్టాలిన్ కు శాలువా కప్పి.. పాదాలకు నమస్కరించారు. దక్షిణాది రాష్ట్రాలలో జరుగుతున్న డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ సభకు కేరళ ముఖ్యమంత్రి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి నేతలు ఎవరూ హాజరు కాలేదు. కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కు మద్దతుగా ఉన్నాయి. ఇక ప్రతిపక్ష వైసిపి కూడా డిఎంకె నిర్వహిస్తున్న సభకు హాజరు కాకపోవడం విశేషం. అయితే ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్ ఉండడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. ఇక రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ఒకే వేదికపై విస్తృతంగా మాట్లాడుకున్నారు. కేటీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.. మరి ఈ వేదికపై స్టాలిన్, విజయన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, డీకే శివకుమార్ ఎలాంటి సందేశం ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

Also Read : డి లిమిటేషన్ తో ఏపీలో పెరిగే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా?