SSC Exams 2025
SSC Exams : విద్యార్థులను( students) మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులది. అటువంటి ఉపాధ్యాయులే దగ్గరుండి విద్యార్థులను దారి తప్పేలా చేశారు. పదో తరగతి పరీక్షల్లో చూచిరాతలకు ప్రోత్సహించారు. త్రిబుల్ ఐటీ లో సీట్ల కోసం టీచర్లే దగ్గరుండి విద్యార్థులతో కాపీయింగ్ చేయించారు. శ్రీకాకుళం జిల్లా పరీక్ష కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులతో అధికారులు సీరియస్ గా స్పందించారు. జిల్లా విద్యాశాఖను అప్రమత్తం చేశారు. వెంటనే అధికారులు రంగంలోకి దిగడంతో ఈ కాపీయింగ్ వ్యవహారం మొత్తం బయటపడింది.
Also Read : ఏపీలో నేటి నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు.. పరీక్ష టైమింగ్స్, రూల్స్ ఇలా ఉన్నాయి..
* రెండు సెంటర్లలో మాస్ కాపీయింగ్
శ్రీకాకుళం జిల్లా( Srikakulam district ) ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో పదోతరగతి పరీక్షల కోసం రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. సెంటర్ ఏలో 207 మంది, బీలో 218 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో నాలుగు స్క్వాడ్ టీంలు ఆ రెండు సెంటర్లలో తనిఖీ చేశాయి. ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు చూసి రాస్తున్నట్లు గుర్తించారు. వీరికి సహకరించిన సిట్టింగ్ స్క్వాడ్ ఎంవి కామేశ్వరరావు, డిపార్ట్మెంటల్ అధికారులు బివి సాయిరాం, హరికృష్ణ… ఇన్విజిలేటర్లు కృష్ణ, నాగేశ్వరరావు, కామేశ్వరరావు, కనకరాజు, శ్రీరాముల నాయుడు, రామ్మోహన్ రావు, శ్రీనివాసరావు, ఫాల్గుణరావుతో పాటు బోధనేతర సిబ్బంది ఒకరిని విధుల నుంచి తొలగించారు. ఏ కేంద్రంలో ముగ్గురు, ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు.
* ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం..
ముందస్తు ప్రణాళికతోనే పరీక్షల్లో చూచి రాతలకు ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఆ పాఠశాల ఉపాధ్యాయులు దగ్గరుండి స్లిప్పులు తయారుచేసి ఎగ్జామ్స్ సెంటర్లో( exam centres ) పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ స్క్వాడ్ ఉన్నా సరే చూచిరాతలకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే దీనిపై డీఈవో సీరియస్ అయ్యారు. కుప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పద్మ కుమారి, చీఫ్ సూపరింటెండెంట్లు దుర్గారావు, లక్ష్మణరావులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు శ్రీకాకుళం డీఈవో. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు సాధించే మార్కులతోనే ట్రిపుల్ ఐటి సీట్లు లభిస్తాయి. ఈ ట్రిపుల్ ఐటీ సీట్ల కోసమే ఉపాధ్యాయులు చూచి రాతను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. అధికారులు అప్రమత్తం కావడంతోనే ఈ వ్యవహారం బయటపడింది.
Also Read : సంవత్సరానికి రెండు సార్లు బోర్డు పరీక్షలు.. పిల్లల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపుతాయా?