HomeతెలంగాణKarimnagar: హరీష్ రావు చేస్తున్న ఆరోపణల మాదిరే.. రేవంత్ సర్కార్ రుణమాఫీ.. కరీంనగర్ రైతుకు జరిగిన...

Karimnagar: హరీష్ రావు చేస్తున్న ఆరోపణల మాదిరే.. రేవంత్ సర్కార్ రుణమాఫీ.. కరీంనగర్ రైతుకు జరిగిన అన్యాయం చూస్తే గుండె తరుక్కుపోతుంది

Karimnagar : ” కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ అనేది ఒక జిమ్మిక్కు. ఏ రైతుకు కూడా సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు. అయినప్పటికీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది” ఇవీ ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. మరో మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే తీరుగా ప్రభుత్వం పై విమర్శలు చేశారు. అయితే హరీష్ రావు చేసినట్టుగానే క్షేత్రస్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక పోస్ట్ ఇందుకు బలం చేకూర్చుతోంది.

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు దఫాలుగా రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ముందుగా లక్ష, ఆ తర్వాత లక్షన్నర, అనంతరం రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. మాట ఇచ్చినట్టుగానే ముందుగా లక్ష, అనంతరం లక్షన్నర, ఆ తర్వాత రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. దానిలోపుగానే రుణాలను మాఫీ చేసినట్టు ప్రకటించింది. ఖమ్మం జిల్లా వైరా సభలో మూడవ దశకు సంబంధించిన రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకులకు విడుదల చేశారు. ఈ సమయంలో ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణాలు మాఫీ చేశామని, ఇచ్చిన మాటకు మేము కట్టుబడ్డామని రేవంత్ వ్యాఖ్యానించారు.. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలని ఒక క్యాంపెయిన్ కూడా నిర్వహించింది.

అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉన్నట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా అందరికీ రుణాలు మాఫీ కాలేదు. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ చెందిన వేల్పుల మల్లయ్య అనే రైతు ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే.. ఈయన తిమ్మాపూర్ మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1.50 లక్షల పంట రుణం తీసుకున్నాడు. అయితే అతడికి 83 రూపాయలు మాత్రమే రుణమాఫీ అయినట్టు మొబైల్ కు సందేశం వచ్చింది. దీంతో మల్లయ్య ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ క్రమంలో ఆయన వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాడు. వారు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురావాలని మల్లయ్యకు సూచించారు. ఈలోగా బ్యాంకు సమయం ముగియడంతో మల్లయ్య ఒక్కసారిగా నిరాశకు గురయ్యాడు. తనకు సంపూర్ణంగా రుణమాఫీ చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. మల్లయ్య కు ఎదురైన అనుభవాన్ని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తోంది. ఇదేనా సంపూర్ణ రుణమాఫీ అంటూ రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రెచ్చిపోతున్నారు. గత ఏడాది అకాల వర్షాల వల్ల రైతులు పంట నష్టపోతే.. ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిన అప్పటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం.. కొందరి రైతులకు 300, 600, వెయ్యి రూపాయలు ఖాతాలో జమ చేసిందని.. మేము రైతుల విషయంలో ఆలా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు. అప్పట్లో రైతుల ఖాతాల్లో జమైన ఆ డబ్బులకు సంబంధించిన స్క్రీన్ షాట్ లను పోస్ట్ చేస్తున్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version