Revanth Reddy : ఉన్నత విద్యావంతులు.. ఉపాధి కోసం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తుంటారు. చదువు రాని, పెద్దగా విద్యార్హత లేని, ఉన్న ఊరిలో ఉపాధి లేని కూలీలు, కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తెలంగాణ నుంచి గల్ఫ్‌దేశాలకు వెళ్లే కూలీలు, కార్మికుల సంఖ్య ఎక్కువ. దశాబ్దాలుగా గల్ఫ్ వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతగానీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉన్న ఊరును, భార్య పిల్లలను వదిలి ఎడాది దేశాలకు వెళ్తున్న కార్మికులు, కూలీలు వివిధ కారణాలతో అక్కడే అసువులుభాస్తున్నారు. ఏటా పదుల సంఖ్యలో గల్ఫ్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇక నకిలీ ఏజెంట్ల మోసాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. విజిట్ వీసాపై గల్ఫ్ దేశాలకు వెళ్తున్న పలువురు.. అక్కడకు వెళ్లాక ఇబ్బంది పడుతున్నారు. తిరిగి రాలేక.. అక్కడ ఉండలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, ఎడారి దేశాల్లో మరణించిన కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులెవరూ వారి బాధను పట్టించుకోలేదు.
సంక్షేమ కార్యక్రమాల జీవో జారీ..
ఈ నేపథ్యంలో పది నెలల క్రితం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక జీవో జారీ చేసింది. ఏదైనా కారణంలో గల్ఫ్‌లో మృతిచెందే కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్‌లో మృతిచెందిన కార్మిక కుటంబాలందరికీ ఈ జీవో ప్రకారం పరిహారం ఇస్తామని తెలిపింది. ఇక గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అడ్వయిజరీ కమిటీ ఏర్పాటు చేసింది. గల్ఫ్ కార్మికుల కష్టాలు తెలుసుకునేందకు ప్రత్యేకంగా ప్రవాసి ప్రజావాని నిర్వహించాలని నిర్ణయించింది. ఇక తెలంగాణలోని అన్ని గురుకులాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సలహా కమిటీ ఏర్పాటు
ఇదిలా ఉంటే.. గల్ఫ్ కార్మికు సంక్షేమం కోసం ప్రత్యేకంగా సలహా కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గల్ఫ్ బోర్డు ఏర్పాటు, ఎన్నారై పాలసీ అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. గల్ప్ కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన ఐదు అంశాలపై చర్చించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక ప్రజావాణి, గురుకులాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకే సోమవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది.