https://oktelugu.com/

Telangana Vimochana Dinothsavam : ‘విమోచనం’ కనుమరుగు.. సాయుధ చరిత్రకు రేవంత్‌ సర్కార్‌ సమాధి.. ఐదేండ్లు ఆ పేరు వినిపించకుండా జీవో!

తెలంగాణలో సాయుధ పోరాటానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలోనూ తెలంగాణ పాలకులు కూడా ఆ పేరు ఎత్తేందుకు జంకుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 17, 2024 / 09:34 AM IST
    Follow us on

    Telangana Vimochana Dinothsavam :  భారత దేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్య్రం వచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్‌ సంస్థానం 1948 సెప్టెంబర్‌ 17 వరకు నిజాం పాలనలోనే కొనసాగింది. అయితే ఈ సమయంలో రజాకార్లు సాగించిన దాష్టీకాలనికి తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో కలిపేందుకు కేంద్ర తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ నిర్ణయించారు. ఈమేరకు ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య చేపట్టారు. రంగంలోకి దిగిన భారత సైన్యానికి నిజాం తల వచ్చారు. దీంతో 1948, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దీనిని తెలంగాణ విమోచన దినంగా నిర్వహించాలని ఏటా.. ఉద్యమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ కూడా డిమాండ్‌ చేసింది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విమోచన దినం అనే పదం ఎత్తడానికి కూడా సాహసించలేదు. పదేళ్లు తెలంగాణ విమోచన దినం నిర్వహించలేదు.

    కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకు..
    ఇక తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినం నిర్వహించేందుకు జంకుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోనే ఆపరేషన్‌ పోలో చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ విమోచన లేదా విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తుందని భావించారు. కానీ కేసీఆర్‌ను మించి నిర్ణయం తీసుకుంది రేవంత్‌ సర్కార్‌. విలీనం లేదా విమోచనం అనే పదం వినిపించకుండా, కనిపించకుండా ప్రత్యేక జీవో జారీ చేసింది. ఏటా సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
    సాయుధ చరిత్ర కనుమరుగే..
    రేవంత్‌ సర్కార్‌ తెచ్చిన జీవోతో తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కనుమరుగువుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ సర్కార్‌ విమోచన దినం అధికారికంగా నిర్వహించకపోయినా ఎలాంటి జీవోలు జారీ చేయలేదు. రేవంత్‌ సర్కార్‌ మాత్రం.. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అమరుల త్యాగం కనుమరుగయ్యేలా జీవో జారీ చేయడంపై మండి పడుతున్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని స్మరించుకోవాల్సింది పోయి వారి చరిత్ర, పోరాటం కనుమరుగయ్యేలా జీవో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    బీజేపీ నేతల ఆగ్రహం…
     తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించకపోవడమే కాకుండా.. సాయుధ చరిత్ర కనుమరుగయ్యేలా రేవంత్‌ సర్కార్‌ జీవో జారీ చేయడంపై మండిపడుతున్నారు. తెలంగాణ విమోచన దినోత్సం నిర్వహించడానికి భయమెందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా విమోచన దినం నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ చరిత్రను బొందపెట్టేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ కంకణం కట్టుకుందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకార కుటుంబాలు కూడా కాంగ్రెస్‌ సర్కార్‌ తెచ్చిన జీవోపై మండిపడుతున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు గుర్తింపు, గౌరవం వివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.