KTR: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు హైదరాబాద్ మెట్రో చుట్టూ తిరుగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టీ కంపెనీ పక్కకు తప్పుకుంది. ఆ కంపెనీ అప్పులతో పాటు.. కొంత మేర నగదును ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. తెలంగాణ ప్రభుత్వం, ఎల్ అండ్ టి సంస్థల మధ్య అంగీకార పత్రాలు కూడా మార్పిడి అయ్యాయి. అతి త్వరలో హైదరాబాద్ మెట్రో తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి రానుంది. అంతేకాదు మెట్రో రెండవ దశ నిర్మాణ పనులు కూడా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది.
హైదరాబాద్ మెట్రోను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా దక్కించుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్ష వ్యక్తం చేస్తుంటే.. గులాబీ పార్టీ నాయకులు మాత్రం విమర్శిస్తున్నారు. గులాబీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో గురించి.. ఎల్ అండ్ టి పక్కకు తప్పుకోవడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను కొనసాగించాలని ఎల్ అండ్ టీ కోరినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ ఒప్పుకోలేదు. అప్పటినుంచి వారి మధ్య గొడవ మొదలైంది. రేవంత్ వైఖరి వల్ల ఎల్ అండ్ టి సంస్థ వెళ్ళిపోతోంది. మేడిగడ్డకు ఉచితంగా మరమ్మతు చేయడానికి ఎల్ అండ్ టీ ఒప్పుకుంది. అలా మరమ్మతు చేస్తే మేడిగడ్డ బాగుపడుతుంది. అది ముఖ్యమంత్రికి ఇష్టం లేదు. అందువల్లే ఎల్ అండ్ టీ సంస్థను బయటికి పంపించారు. ఇందులో రేవంత్ ప్రభుత్వం సాధించిన విజయం ఏమీ లేదని” కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాదులో మెట్రో కు 250 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములకు మార్కెట్లో విపరీతంగా విలువ ఉంది. కాంగ్రెస్ నేతల కన్ను ఈ భూముల మీద పడిందని.. అందువల్లే మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ని తప్పించేలా కాంగ్రెస్ నేతలు కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు.. తెలంగాణ ప్రభుత్వం మెట్రోను తీసుకోవడం పట్ల కేంద్రం విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతవరకు స్పందించలేదు. మెట్రోను తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకోవడం పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు.