Bank Manager: ఇది మామూలు మోసం కాదు. ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు.. ఆ తర్వాత ఆ లెటర్ ను కలెక్టర్ కార్యాలయం ముద్ర కోసం పంపించాడు. చివరికి దొరికిపోయాడు. ఇలా చేసింది ఆర్థిక నేరగాడు కాదు. మోసగాడు కాదు.. ఒక బ్యాంకు మేనేజర్.. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
ఒకప్పుడు బ్యాంక్ అధికారులు చాలా నిజాయితీగా ఉండేవారు. ఖాతాదారుల సొమ్ముకు సెక్యూరిటీగా ఉండేవారు. రుణాల మంజూరు విషయంలో జాగ్రత్త పాటించేవారు. రుణాల రికవరీ విషయంలో కూడా అలానే వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు బ్యాంక్ అధికారులలో కొందరు దోపిడీదారుల అవతారం ఎత్తారు. బ్యాంకు సొమ్మును నచ్చిన వాళ్లకు ఇస్తున్నారు. ఈ క్రమంలో లంచాలు వసూలు చేస్తున్నారు. బ్యాంకులో ఖాతాదారులు దాచుకున్న బంగారాన్ని సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అందరూ బ్యాంక్ అధికారులు ఇలా ఉన్నారంటే.. చెప్పడం కష్టం గానీ.. అందులో కొంతమంది అధికారులు మాత్రం ఇలానే ఉన్నారు. మోసాలకు పాల్పడుతూ.. అక్రమాలకు పాల్పడుతూ బ్యాంకు సొమ్మును లూటీ చేయడమే కాదు.. ఖాతాదారుల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో ఏకంగా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఒక బ్యాంకు మేనేజర్. చివరికి అరెస్టు అయ్యాడు. కలెక్టర్ కార్యాలయంలో అటెండర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే కలెక్టర్ సంతకాన్ని తాను అప్ గ్రేడేషన్ కోసం మాత్రమే ఫోర్జరీ చేసినట్టు బ్యాంకు మేనేజర్ చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. సూర్యాపేట జిల్లా కలెక్టర్గా తేజస్ నందలాల్ పవర్ కొనసాగుతున్నారు. ఇక్కడ డిఆర్డిఏ పీడిగా సన్యాసయ్య ఉన్నారు. అయితే వీరి పేర్లతో ఉన్న జాయింట్ అకౌంట్ అప్ గ్రేడేషన్ కోసం బ్యాంకు మేనేజర్ రఘు ప్రసాద్ పత్రాలు సిద్ధం చేశాడు.
సన్యాసయ్య సంతకం చేసినప్పటికీ.. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో సంతకం చేయలేకపోయారు. దీంతో మేనేజర్ రఘు ప్రసాద్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో స్టాంపు కోసం అటెండర్ వద్దకు మేనేజర్ ఆ పత్రాలను తీసుకెళ్లారు. ఆ పత్రాలను చూసిన అటెండర్ అనుమానించారు. కలెక్టర్ సంతకం ఎప్పటి మాదిరిగా లేకపోవడంతో గన్మెన్.. కలెక్టర్ సీసీలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కలెక్టర్ దాకా వెళ్ళింది. దీంతో ఆయన విచారణ ఆలోచించారు. అయితే తాను సంతకం పెడుతున్న సమయంలో కలెక్టర్ సంతకం లేదని సన్యాసయ్య స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డిఏ పిడి సన్యాసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బ్యాంకు మేనేజర్ రఘు ప్రసాద్ ను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.