Phone Typing: ఏఐ తో ఫోన్ టైపింగ్.. ఓసారి ట్రై చేసి చూడండి.. జన్మలో వదిలిపెట్టరు

షిఫ్ట్ కీ లోనూ జీ బోర్డు మాదిరిగానే సులభంగా టైప్ చేసే భాషలకు వెంటనే మారే అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో 700 కి పైగా భాషలను సపోర్ట్ చేస్తుంది. స్పేస్ బార్ మీద కుడి ఎడమవైపు స్వైప్ చేస్తే చాలు మనకు ఇష్టం వచ్చిన భాషలకు వెంటనే మళ్లొచ్చు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 6, 2024 12:25 pm

Phone Typing

Follow us on

Phone Typing: ప్రతి పనికి స్మార్ట్ ఫోన్ వాడకం అనేది ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. ఇదే సమయంలో టైపింగ్ అనేది కూడా అత్యవసరమైపోయింది. అయితే ఈ ఫోన్ టైపింగ్ అంత ఈజీ కాదు. వేగంగా టైప్ చేసే క్రమంలో చాలా తప్పులు దొర్లుతాయి. ఎదుటి వాళ్ళ ముందు చులకన అయ్యేందుకు కారణమవుతాయి. కాలక్రమంలో ఈ ఫోన్ టైపింగ్ లో కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పటికీ… ఇప్పటికి ఏదో ఒక సమస్య యూజర్లను ఇబ్బంది పెడుతూనే ఉంది. అయితే అలాంటివారికి ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక ఊపు ఊపుతున్న artificial intelligence ను ఫోన్ టైపింగ్ కు అనుసంధానం చేశారు. దీనివల్ల చాలా అధునాతన సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయని.. యూజర్లకు ఫోన్ టైప్ మరింత సులభం అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టైప్ ఎలా చేయాలంటే..

మనలో చాలామంది మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డ్ వాడుతూ ఉంటారు. ఇది ఉచితంగానే లభిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలలో దీనిని వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. దీనికి కృత్రిమ మేధ తోడైతే.. మరింత వేగంగా టైప్ చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను స్విఫ్ట్ కీబోర్డుకు అనుసంధానం చేస్తే ఇష్టమైన స్టిక్కర్లను సృష్టించుకోవచ్చు.. డాల్ – ఈ 3 పరిజ్ఞానంతో ఇది పనిచేస్తుంది. దీనిని వాడుకోవాలంటే ముందుగా ఫోన్లో స్విఫ్ట్ కీ ని ఓపెన్ చేయాలి.. ఆ తర్వాత ఎడమవైపున కనిపించే బాణం గుర్తు మీద తాకితే టూల్ బార్ వస్తుంది. కీబోర్డుకు కుడి మూలన ఉండే మూడు చుక్కల మీద నొక్కి పట్టాలి. ఆ తర్వాత స్టిక్కర్ ఆప్షన్ ఎంచుకోవాలి. దాని అడుగున మంత్రదండం లాంటి ఒక బటన్ కనిపిస్తుంది. దానిపై ఒక క్లిక్ చేస్తే టెక్స్ట్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో ఎలాంటి స్టిక్కర్ మనకు అవసరమో వివరించాలి. అంతే.. క్షణాల్లో దానికి తగ్గట్టుగా స్టిక్కర్ పుట్టుకొస్తుంది.

షిఫ్ట్ కీ లోనూ జీ బోర్డు మాదిరిగానే సులభంగా టైప్ చేసే భాషలకు వెంటనే మారే అవకాశం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ లో 700 కి పైగా భాషలను సపోర్ట్ చేస్తుంది. స్పేస్ బార్ మీద కుడి ఎడమవైపు స్వైప్ చేస్తే చాలు మనకు ఇష్టం వచ్చిన భాషలకు వెంటనే మళ్లొచ్చు. స్విఫ్ట్ కీ అనే యాప్ లో లాంగ్వేజ్ ఆప్షన్ లోకి వెళ్లి అనేక భాషలోనూ వెతకచ్చు. అనుసంధానం కూడా చేసుకోవచ్చు.

ఇక ఈ స్విఫ్ట్ కీ లో క్లిప్ బోర్డ్ అనే ఫీచర్ ఇన్ బిల్ట్ గా ఉంటుంది. దీనిద్వారా ఫోన్ నుంచి కంప్యూటర్ కు, కంప్యూటర్ నుంచి ఫోన్ కు టెక్స్ట్ లింక్ కాపీ లేదా పేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని సెట్ చేసుకోవడం పూర్తయితే చాలు.. సులభంగా వాడుకోవచ్చు. ఇక పైన ఎడమ భాగంలో ఉన్న బాణం గుర్తును నొక్కి పట్టి టూల్ బార్ లోకి వెళ్లి.. క్లిప్ బోర్డు బటన్ మీద తాగితే.. అక్కడి నుంచి ఎనేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనిని పీసీతో అనుసంధానం చేసుకోవాలంటే మాత్రం యాప్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

ఇక ఆర్టిఫిషల్ ద్వారా కో పైలట్ చాట్ బాట్ స్విఫ్ట్ కీ లోనూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ మీద ఎలాంటి పని చేస్తున్నప్పటికీ సెర్చ్, చాట్, కొత్త మెసేజ్ కంపోజ్ వంటి నిత్య నూతనమైన పనులను దీనిద్వారా చేసుకునే వెసలు బాటు ఉంటుంది. పైగా కొత్త విషయాలను ఎప్పటికప్పుడు రాసిపెడుతుంది. స్విఫ్ట్ కీ ని మనం ఉపయోగిస్తున్నప్పుడు, ఎడమవైపున ఉండే బటన్ నొక్కడం ద్వారా టూల్ బార్ ప్రత్యక్షమవుతుంది. దానివల్ల కో పైలట్ ను ఎప్పటికప్పుడు వీక్షించవచ్చు.

ఒకవేళ మనం ఏదైనా విషయాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు కీబోర్డు పసిగట్టకూడదు లేదా నిఘా వేయకూడదని భావిస్తే దానిని వెంటనే ఇన్ కాగ్నిటో మోడ్ కు మళ్ళించుకోవచ్చు. ఇది డీ ఫాల్ట్ గా డిజేబుల్ అయి ఉంటుంది. అయితే టూల్ బార్ ద్వారా దీనిని త్వరగానే ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనికోసం మూడు చుక్కల మెనూ ను తాకి, ఇన్ కాగ్నిటో బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది.