Instagram New Feature: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇతరులు తమను ట్యాగ్ చేసిన పోస్టులను కేవలం ‘Tagged’ విభాగంలో మాత్రమే కాకుండా.. నేరుగా తమ ప్రధాన ప్రొఫైల్ గ్రిడ్‌లోనూ ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది.
ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా మనల్ని తమ పోస్టులో ట్యాగ్ చేస్తే.. ఆ పోస్టు ప్రత్యేకంగా ఉండే ‘Tagged’ సెక్షన్‌లో కనిపించేది. అయితే ఆ పోస్టును మన ప్రధాన ప్రొఫైల్ గ్రిడ్‌లో చూపించాలంటే ప్రత్యేకంగా షేర్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా వచ్చిన ఫీచర్‌తో ఈ ప్రక్రియ మరింత సులభం కానుంది.
మూడు మార్గాల్లో యాడ్ చేసుకోవచ్చు
ట్యాగ్ చేసిన పోస్టును ప్రొఫైల్ గ్రిడ్‌లోకి తీసుకురావడానికి ఇన్‌స్టాగ్రామ్ మూడు ఆప్షన్లను అందిస్తోంది. యూజర్‌ను ఏదైనా పోస్టులో ట్యాగ్ చేసినప్పుడు వచ్చే డైరెక్ట్ మెసేజ్ నోటిఫికేషన్ నుంచే ఆ పోస్టును ప్రధాన గ్రిడ్‌లో యాడ్ చేసుకోవచ్చు.
అలాగే ట్యాగ్ చేసిన పోస్టును ఓపెన్ చేసి మూడు చుక్కల మెనూను ఎంచుకోవడం ద్వారా కూడా ఈ ఆప్షన్‌ను ఉపయోగించవచ్చు. మరో మార్గంగా ‘Tagged’ ట్యాబ్‌లో ఉన్న పోస్టుపై కొద్దిసేపు ప్రెస్ చేసి ఉంచడం ద్వారా దాన్ని మెయిన్ ప్రొఫైల్ గ్రిడ్‌లోకి చేర్చుకోవచ్చు.
గ్రిడ్‌లో ఎక్కడ కనిపిస్తుంది?
కొత్తగా యాడ్ చేసిన ట్యాగ్‌డ్ పోస్టులు సాధారణంగా ప్రొఫైల్ గ్రిడ్‌లో రివర్స్ క్రోనాలాజికల్ ఆర్డర్ ప్రకారం కనిపిస్తాయి. అంటే తాజాగా యాడ్ చేసిన పోస్టులు కొత్త కంటెంట్‌లా గ్రిడ్‌లోకి చేరతాయి. అయితే ఇప్పటికే తమ ప్రొఫైల్ గ్రిడ్‌ను ప్రత్యేకంగా రీఅరేంజ్ చేసుకున్న యూజర్లకు మాత్రం ఆ లేఅవుట్ కొనసాగుతుంది. కొత్త పోస్టును యాడ్ చేసినందుకు వారి కస్టమ్ లేఅవుట్ ఆటోమేటిక్‌గా మారదు.
పోస్టును తొలగిస్తే ఒరిజినల్ పోస్టుపై ప్రభావం ఉండదు
ఈ ఫీచర్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ట్యాగ్ చేసిన పోస్టును ప్రధాన ప్రొఫైల్ గ్రిడ్‌లో యాడ్ చేసినంత మాత్రాన ఆ పోస్టు ఒరిజినల్ అప్‌లోడ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే తర్వాత ఎప్పుడైనా ఆ పోస్టును తమ మెయిన్ గ్రిడ్ నుంచి తొలగించుకోవచ్చు. అలా తొలగించినప్పటికీ ఒరిజినల్ పోస్టు డిలీట్ కాదు. ‘Tagged’ విభాగంలో కూడా ఆ పోస్టు కొనసాగుతుంది.
ఎవరికి ఉపయోగకరం?
గ్రూప్ ఫొటోలు, ఫ్రెండ్స్‌తో దిగిన ప్రత్యేక జ్ఞాపకాలు, క్రియేటర్ కొలాబరేషన్స్ వంటి పోస్టులను తమ ప్రొఫైల్‌లో చూపించాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇతరులు పోస్ట్ చేసిన కంటెంట్‌లో తమకు సంబంధించిన మంచి ఫొటోలు ఉన్నప్పుడు.. వాటిని స్వయంగా మళ్లీ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రొఫైల్‌లో ప్రదర్శించుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరి ఈ ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు. కొత్త ఆప్షన్ అందుబాటులోకి రావడంతో యూజర్లు తమ ప్రొఫైల్‌లో ఇతరులు ట్యాగ్ చేసిన కంటెంట్‌లో ఏది కనిపించాలి, ఏది కేవలం ‘Tagged’ విభాగంలో ఉండాలి అనే విషయంపై మరింత నియంత్రణ పొందనున్నారు.