Nano Banana AI: ఒక గొర్రె మేస్తూ మేస్తూ ఒక బావిలో పడితే.. మిగతా గొర్లు కూడా దాని దారినే అనుసరిస్తుంటాయి.. అరే అది బావిలో పడింది కదా.. అలా పడిపోతే ప్రాణాలు పోతాయి కదా అని ఏమాత్రం ఆలోచించవు. ముందు గొర్రె బావిలో పడింది కాబట్టి.. తాము కూడా అదే దారిని అనుసరించాలని అనుకుంటాయి. అంతేతప్ప ఎందుకు? ఏమిటి? ఎలా? అని అసలు ఆలోచించవు. గొర్రెల మాదిరిగానే ఇప్పుడు మనుషులు కూడా ప్రవర్తిస్తున్నారు.. అద్భుతమైన జ్ఞానం.. అపరిమితమైన మేథో సంపత్తి ఉన్నప్పటికీ మనుషులు గొర్రెల మాదిరిగానే వ్యవహరిస్తున్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్తదారుల్లో వెళ్తున్నాయి. ఊహించిన దాని కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తద్వారా మనిషి జీవితం మరింత సులభతరం అవుతోంది. వాస్తవానికి శాస్త్ర సాంకేతిక రంగాలు మనిషి జీవితాన్ని సుఖవంతం చేస్తున్నప్పటికీ.. కొన్ని విషయాలలో మాత్రం ఎక్కడా లేని బద్ధకాన్ని కలిగిస్తున్నాయి. మనకు తెలియకుండానే లేజినెస్ అలవాటు చేస్తున్నాయి. దీనివల్ల మనుషుల జీవితాలు మొనాటనిగా మారిపోతున్నాయి. ఇది రకరకాల దుష్పరిణామాలకు దారితీస్తోంది. ఇప్పుడిక కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో మనుషులు స్వతహాగా ఆలోచించడం మానేశారు. ప్రతి దానికి కృత్రిమ మేధ మీద ఆధారపడుతున్నారు. ఒకప్పుడు గూగుల్ తల్లిని ఏదో ఒక విషయంలో మాత్రమే సంప్రదించేవారు. ఇప్పుడు గూగుల్ తల్లి కూడా పక్కకు వెళ్ళిపోయింది. కృత్రిమ మేధ అంతటా ఆవహించింది.
కృత్రిమ మేధ లో పెద్దపెద్ద కంపెనీలు ప్రవేశించాయి. ఒకదాని మించి మరొకటి అన్నట్టుగా కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తున్నాయి. తాజాగా “నానో బనానా” సంచలనం సృష్టిస్తోంది. కృత్రిమ మేధను ఉపయోగించి టోపొలాజికల్ బాడీకి సంబంధించిన చిత్రాలను ఇది అందిస్తోంది. డిజిటల్ వెర్షన్ కూడా రూపొందిస్తోంది. అయితే ఇది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ పేరు మీద నకిలీ వైద్య బిల్లులు, లోన్, కారు, డూప్లికేట్ ఐడెంటిటీ.. ఇక రకరకాల దారుణాలకు పాల్పడవచ్చు. ఏదైన ఘోరంలో మిమ్మల్ని ఇరికించవచ్చు. నకిలీ జీవిత సంఘటన సృష్టించవచ్చు. అందువల్లే ట్రెండింగ్ అనే ట్రాప్ లో పడి మీ వ్యక్తిగత వివరాలను పబ్లిక్ డొమైన్ లో నమోదు చేస్తే ప్రమాదం పొంచి ఉంటుంది. అందువల్లే ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.