AI Video On PM Modi Mother: రాజకీయాలలో కొన్ని విలువలను కాపాడుకోవాలి. రాజకీయ పార్టీలు కొన్ని విలువలను ప్రదర్శించాలి. లేకపోతే సమాజం వర్గాలుగా విడిపోతుంది. నీతికి, న్యాయానికి, ధర్మానికి చోటు లేకుండా పోతుంది. ఒకప్పుడేమో గాని ఇప్పటి రాజకీయాలలో మాత్రం అలాంటివేవీ కనిపించడం లేదు. నీతికి, న్యాయానికి, ధర్మానికి రాజకీయ పార్టీలు దూరంగా జరుగుతున్నాయి. వ్యక్తిగత స్వార్థానికి.. వ్యక్తిగత లక్ష్యాలకు.. అధికారానికి మాత్రమే దగ్గరగా ఉంటున్నాయి. వాటికోసం ఎంత దాకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉంటున్నాయి. ఏం చేయడానికి అయినా సై అంటున్నాయి. జాతీయ, ప్రాంతీయ అని తేడా లేకుండా అన్ని పార్టీలు ఇదేవిధంగా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు ఇండియా కూటమికి.. ఎన్డీఏ కూటమికి అత్యంత ప్రాధాన్యమైనవి. ఎందుకంటే నరేంద్ర మోడీని ఓటు చోర్ అని రాహుల్ గాంధీ అంటున్నారు. అదంతా అబద్ధమని నిరూపించాలని మోడీ భావిస్తున్నారు. సో మొత్తంగా ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు రెండు ప్రధాన కూటములకు అత్యంత ముఖ్యమైనవి. ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచిన ఏ కూటమైనా సరే అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటుంది. ఓడిపోయిన కూటమి ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటుంది. పైగా గడిచిన పర్యాయాలలో బీహార్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయారు. అధికారానికి అన్ని పార్టీలను దూరంగానే ఉంచాయి. ప్రతిపక్షానికి ఎంతైతే ప్రాధాన్యం ఇచ్చాయో.. అధికార పక్షానికి కూడా అంతే మద్దతు ఇచ్చాయి.
ఈ రాష్ట్రంలో గెలవడానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనసులను చూరకొనడానికి ప్రయత్నిస్తుండగా.. ప్రతిపక్ష కూటమి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడ ఓటు అధికార్ ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ కూడా పలు దఫాలుగా బీహార్ లో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలు కూడా పోటాపోటీగా ప్రచారంలో ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో బీహార్ లో ఎన్నికలు జరుగుతాయి అనుకుంటుండగా కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం రూపొందించిన ఒక వీడియో వివాదాస్పదమైనది. కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన వీడియోలో స్వర్గంలో ఉన్న ప్రధానమంత్రి మాతృమూర్తి నరేంద్ర మోడీని తిడుతున్నట్టుగా.. ఇటువంటి రాజకీయాలు మానేయమని ఆదేశిస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో పై బిజెపి నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుందని.. ఎంతటి దుష్ప్రచారానికైనా సిద్ధమవుతుందని.. ఈ వీడియో ద్వారా తెలుస్తోందని బిజెపి నేతలు అంటున్నారు. ఇటీవల బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర మోడీ తల్లిని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దానికి రాహుల్ గాంధీ క్షమాపణ కూడా చెప్పారు. ఆ వ్యాఖ్యలు చేసిన నాయకుడిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇదే సమయంలో ఇటీవల ఇదే విషయాన్ని నరేంద్ర మోడీ బీహార్ లో జరిగిన ఓ సమావేశంలో చెప్పుకుంటూ బాధపడిపోయారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పులు కాంగ్రెస్ పార్టీ ఐటి విభాగం చేయడంతో.. బిజెపి అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది.