CIBIL score effect on job: ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుకు ఒక వ్యక్తిని నియమించింది. నియామకం జరిగిపోయింది. కానీ, తర్వాత ఆ వ్యక్తి సిబిల్ స్కోర్‌ను పరిశీలించగా, బ్యాంకు అధికారులు షాక్ అయ్యారు. అతడు తీసుకున్న వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు ఏవీ కూడా సకాలంలో చెల్లించకుండా, పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో సదరు వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణ లేదని నిర్ధారించిన బ్యాంకు, అతని నియామకాన్ని రద్దు చేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు తన నియామకాన్ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “నాకు ఉద్యోగం వచ్చిందని, ఇప్పుడు రద్దు చేయడం సరికాదు” అని వాదించాడు.
Also Read: Rinku Singh Wedding Postponed: రింకూ సింగ్ పెళ్లి వాయిదా.. కారణం ఇదే
కోర్టు ఏం చెప్పింది?
ఎస్‌బీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనను బలంగా వినిపించారు. “మా దరఖాస్తు నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఉద్యోగానికి నియమితులయ్యే వారికి ఎలాంటి రుణం పెండింగ్‌లో ఉండకూడదు. సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి” అని తెలిపారు. ఈ వాదనలను అంగీకరించిన జస్టిస్ మాలా కీలక వ్యాఖ్యలు చేశారు. “దరఖాస్తులో సిబిల్ స్కోర్ బాగుండాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజాధనాన్ని నిర్వహించే ఒక వ్యక్తికి నగదు వ్యవహారంలో క్రమశిక్షణ చాలా అవసరం. సిబిల్ స్కోర్ సరిగా లేని వారిపై నమ్మకం ఎలా ఉంచగలం?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సిబిల్ స్కోర్ సరిగా లేని వ్యక్తి నియామకాన్ని రద్దు చేసిన ఎస్‌బీఐ ఉత్తర్వులు కరెక్టే అని బుధవారం కోర్టు తీర్పు ఇచ్చింది.
సిబిల్ స్కోర్ ఎందుకు ముఖ్యం?
సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ హిస్టరీకి ఒక నిదర్శనం. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీరు తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించారా లేదా అనే దాని ఆధారంగా ఈ స్కోర్ నిర్ణయించబడుతుంది.
750+ సిబిల్ స్కోర్: చాలా మంచి స్కోర్. మీకు బ్యాంకులు సులభంగా లోన్లు ఇస్తాయి.
650-750 మధ్య: పర్వాలేదు, కానీ కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఆలోచించవచ్చు.
650 కంటే తక్కువ: ఇది చెడు సిబిల్ స్కోర్. లోన్లు పొందడం చాలా కష్టం అవుతుంది.
Also Read: Kannappa Runtime: కన్నప్ప సినిమా రన్ టైం ఎంతంటే..
సాధారణంగా సిబిల్ స్కోర్‌ను లోన్‌లు, క్రెడిట్ కార్డుల ఆమోదం కోసమే చూస్తారు. అయితే, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉద్యోగ నియామకాలకు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లేదా ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న ఉద్యోగాలకు ఇది చాలా కీలకం. ఒక వ్యక్తి తన సొంత డబ్బును సరిగా మెయింటెన్ చేయలేకపోతే సంస్థ డబ్బును ఎలా నిర్వహిస్తాడనేది కంపెనీలు ఆలోచిస్తాయి.
మీ సిబిల్ స్కోర్‌ను ఎలా మెరుగుపరచుకోవాలి?
బిల్లులను సకాలంలో చెల్లించండి: లోన్ EMIలు, క్రెడిట్ కార్డు బిల్లులను ఎప్పుడూ గడువులోగా చెల్లించండి.
క్రెడిట్ వినియోగాన్ని తగ్గించండి: మీ క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30శాతం కంటే తక్కువ వాడటానికి ప్రయత్నించాలి.
ఎక్కువ లోన్‌లు తీసుకోకండి: ఒకేసారి చాలా రుణాలు తీసుకోవడం వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుంది.
పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయవద్దు : కొన్నేళ్ల క్రితం తీసుకున్న పాత క్రెడిట్ కార్డు రద్దు చేయవద్దు, అవి మీ క్రెడిట్ హిస్టరీకి ఉపయోగపడతాయి.
సిబిల్ రిపోర్ట్‌ను చెక్ చేయాలి : అప్పుడప్పుడు మీ సిబిల్ రిపోర్ట్‌ను చెక్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చు.
ఈ మద్రాసు హైకోర్టు తీర్పుతో, ఆర్థిక క్రమశిక్షణ అనేది మన వ్యక్తిగత జీవితానికే కాదు, వృత్తిపర జీవితానికి కూడా చాలా ముఖ్యమని మరోసారి రుజువైంది.