Sampoornesh Babu : ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అవకాశాలు సంపాదించడం అనేది చిన్న విషయం కాదు. బోలెడంత టాలెంట్ ఉన్నవాళ్లు కూడా అదృష్టం కలిసిరాక సినిమాల్లో అవకాశాలు రాక, ఇప్పటికీ కృష్ణ నగర్ లోనే ఉన్నారు. అయితే సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) లాంటి వాళ్లకు అదృష్టం తలుపు తట్టింది. సినిమాల్లో అవకాశాలు కోసం ఎదురు చూడకుండా తన సన్నిహితులతో కలిసి హీరో గా ‘హృదయ కాలేయం’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేశాడు. అప్పుడు ఈ మూవీ టైటిల్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీజర్ కూడా తెగ వైరల్ అయ్యింది. ఏకంగా దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli) వంటి వారు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడం గమనార్హం. అలా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ లో హంగామా చేస్తూ సంపూ ల్యాండ్ అయ్యాడు. ఆ చిత్రం కమర్షియల్ గా కూడా సూపర్ హిట్ అయ్యింది.
Also Read : ప్రభాస్ ‘రాజా సాబ్’ ఆ చిత్రానికి రీమేకా..? ఆసక్తి రేపుతున్న తలుపుల స్టోరీ!
ఈ చిత్రం తర్వాత ఆయన అనేక సినిమాల్లో హీరోగా నటించాడు. కొన్ని చిత్రాల్లో స్పెషల్ క్యామియో రోల్స్, కమెడియన్ రోల్స్ కూడా చేశాడు. కానీ ఎందుకో సంపూర్ణేష్ బాబు టాలెంట్ కి తగ్గ రేంజ్ కి వెళ్లలేకపోయాడని అందరి అభిప్రాయం. ఇండస్ట్రీ లో ఒక మంచి కమెడియన్ గా సంపూర్ణేష్ బాబు స్థిరపడొచ్చు, కానీ ఎందుకో దర్శక నిర్మాతలు ఆ విధమైన ఆలోచన చేయలేదు. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకు ఎందుకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదో చెప్పుకొచ్చాడు. ‘హృదయ కాలేయం’ సినిమా తర్వాత సంపూర్ణేష్ బాబుకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది. అవకాశం రాగానే ఆయన కూడా ఒప్పుకొని ఈ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. కానీ కనీసం 9 రోజులు కూడా అక్కడి వాతావరణం భరించలేక గోల చేసి హౌస్ నుండి బయటకు వచేసాడు.
అయితే బయటకు వచ్చే ముందు,ఆ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) చాలా వరకు సంపూర్ణేష్ బాబు ని ఆపేందుకు ప్రయత్నం చేశాడట. ఈ షో నీ కెరీర్ కి ఎంతో ఉపయోగపడుతుంది, ఎన్నో అవకాశాలు వస్తాయి, పెద్ద రేంజ్ కి వెళ్తావు, ఉండిపో అని అన్నాడట. కానీ సంపూర్ణేష్ బాబు మాట వినకుండా వచ్చేసాడట. ఆరోజు ఎన్టీఆర్ అన్నయ్య మాట విని షోలో కొనసాగి ఉండుంటే, ఈరోజు నా కెరీర్ వేరేలా ఉండేదని, జీవితంలో పెద్ద పొరపాటు చేశానని సంపూర్ణేష్ బాబు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుండి పల్లెటూరి వాతావరణం లో పుట్టి పెరిగిన తనకు, అలా ఒకే హౌస్ లో, బయట ప్రపంచం తో సంబంధం లేకుండా ఉన్నప్పుడు చాలా హోమ్ సిక్ ఫీల్ అయ్యానని, అందుకే ఊపిరి ఆడక బయటకు వచ్చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : ఒక్క ఫస్ట్ లుక్ తో 160 కోట్లు..చరిత్ర తిరగరాస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’