Peddireddy Mithun Reddy : ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం చేసిన అవినీతి పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే కొంతమంది నేతల అరెస్టు కూడా జరిగింది. మరి కొందరిపై కేసులు నమోదయ్యాయి. కొందరు నేతలు అరెస్టులు జరగకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు కూడా. అయితే ఇటువంటి వారికి కొంతమందికి న్యాయస్థానాల్లో ఉపశమనం దక్కుతోంది. కానీ కొంతమందికి షాక్ తప్పడం లేదు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్నది కూటమి చేస్తున్న ఆరోపణ. ఏపీలో గత ఐదేళ్లలో 90 వేల కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగగా.. దాదాపు 18 వేల కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. లోక్సభలో మద్యం కుంభకోణం పై ఆరోపణలు చేసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కీలక ఆధారాలను ఆయనకు సమర్పించారు.
Also Read : ఆ కీలక నేతపై జగన్ ఆగ్రహం.. కోటరీ నుంచి ఔట్!
* సిఐడి విచారణ..
కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి లిక్కర్ అమ్మకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ టిడిపి నేతలు( TDP leaders) తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. విచారణను సిఐడి కి అప్పగించారు. అయితే ఇప్పుడు లోక్ సభలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించేసరికి ఇది కొత్త వివాదానికి దారితీసింది. ఈ కేసులో ఇప్పుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారన్నది ఆరోపణ. మద్యం కంపెనీలను బెదిరించి డిష్టలరీలను సొంతం చేసుకున్నారన్నది ఆయనపై ఉన్న అభియోగం. దీంతో మిధున్ రెడ్డి అరెస్ట్ ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈరోజు ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. కానీ ధర్మాసనం డిస్మిస్ చేయడంతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి షాక్ తగిలినట్లు అయింది. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం శరవేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది.
* లిక్కర్ కుంభకోణం పై ఫోకస్..
వాస్తవానికి కూటమి( Alliance government ) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి లిక్కర్ కుంభకోణం పై దృష్టి పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసులో తన పేరు చేర్చి ఎక్కడ అరెస్టు చేస్తారని అనుమానంతో మిధున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. వీటిపై మార్చి 24న హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈరోజు ఏకంగా ఆ పిటీషన్ కొట్టి వేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగియనుంది.
* మద్యంపై అనేక రకాల ఆరోపణలు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో ఆన్లైన్ నగదు చెల్లింపులు చేయకుండా.. నేరుగా డబ్బులు తీసుకుని ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని.. మద్యం సరఫరా లోను అనేక అవకతవకలు జరిగాయని టిడిపి నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ రెడ్డి పై కేసు నమోదు అయింది. అయితే వాసుదేవ రెడ్డి విచారణ సమయంలో మిథున్ రెడ్డి పాత్రపై పలు ఆధారాలు బయటపడినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన అరెస్టు జరగకుండా ముందస్తు బెయిల్ కోసం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సిఐడి చెబుతోంది. కేవలం మీడియా కథనాలను అనుసరించి బెయిల్ పిటిషన్ వేయడం ఏమిటనేది సిఐడి న్యాయవాది ప్రశ్నించారు. దీంతో న్యాయస్థానం బెయిల్ పిటిషన్ రద్దు చేసింది.
Also Read : టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్.. జనసేన సరికొత్త డిమాండ్.. హాట్ హాట్ గా విశాఖ పాలిటిక్స్!