India Vs USA: ఓ వైపు జన్మభూమి.. మరోవైపు కర్మభూమి.. అమెరికన్ భారతీయులకు ఎంత కష్టం?

సాఫ్ట్ వేర్ రంగం విస్తరిస్తున్న కొద్దీ మన దేశం నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందులో తెలుగువారు 1.35 శాతం ఉంటారట.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 1:06 pm

India Vs USA

Follow us on

India Vs USA: అమెరికా.. పేరు చెప్తే ఆశల స్వర్గం కళ్ళ ముందు కనిపిస్తుంది. భూతల స్వర్గం సజీవంగా కదలాడుతుంది. అందుకే ఉపాధి కోసం, ఉన్నతమైన చదువు కోసం, మెరుగైన జీవనం కోసం చాలామంది అమెరికా వెళుతుంటారు. శ్వేత దేశంలో నివసిస్తున్న భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్య పౌరసత్వం వచ్చింది.. మన దేశం నుంచి చాలామంది అక్కడ నివసిస్తున్నప్పటికీ.. అందరికీ పౌరసత్వం వచ్చే అవకాశం లేదట. ఇక అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల్లో ఆ దేశ జనాభాలో 14 శాతంగా ఉంటుందట. అందులో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంటుందట. సాఫ్ట్ వేర్ రంగం విస్తరిస్తున్న కొద్దీ మన దేశం నుంచి వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇందులో తెలుగువారు 1.35 శాతం ఉంటారట. అంటే దాదాపు 50 లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. ఇక కొత్తగా 65,960 మంది అమెరికన్ పౌరులుగా రూపాంతరం చెందారు.

అమెరికన్ భారతీయులకు సరికొత్త కష్టం

అయితే ఇంతమంది భారతీయులకు అమెరికాలో సరికొత్త కష్టం వచ్చింది. ఆ కష్టం పేరే టి20 వరల్డ్ కప్. అమెరికాలో క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు ఐసీసీ టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. ఈ దేశంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తోంది. అప్పటికప్పుడు మైదానాలు సిద్ధం చేసి.. ఆటగాళ్లతో ఆడిస్తోంది. మైదానాల నిర్వహణ, కూర్పు పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఐసీసీ ప్రయత్నాన్ని అందరూ ఆమోదిస్తున్నారు. సహజంగానే అమెరికాలో బాస్కెట్ బాల్, టెన్నిస్, వాలీబాల్, ఫుట్ బాల్ కు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు టి20 వరల్డ్ కప్ టోర్నీ విజయవంతమవుతుందా? అనే సందేహాలు ఉండేవి. అయితే వాటన్నింటినీ అమెరికన్లు.. ముఖ్యంగా అమెరికన్ భారతీయులు పటాపంచలు చేశారు.. టీమిండియా ఆడే మ్యాచ్లకు విపరీతంగా హాజరవుతూ సరికొత్త రికార్డులను సృష్టించారు. న్యూయార్క్ మైదానానికి వచ్చిన ప్రేక్షకులను చూస్తుంటే.. ఆడుతోంది ఇండియాలోనా అనే అనుమానం కలిగింది.

రెండు దేశాలకు సపోర్టు

అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. సహజంగా టీమిండియా ఆడే మ్యాచ్ లకు అమెరికన్ భారతీయులు హాజరవుతూ ఉంటారు. అయితే స్వయంగా అమెరికాలోనే మ్యాచ్లు జరుగుతూ ఉండడంతో సాధ్యమైన దానికంటే ఎక్కువ ప్రేక్షకులు వచ్చారు. ముఖ్యంగా బుధవారం అమెరికా, భారత్ తలపడిన మ్యాచ్ కు చాలామంది ఇండియన్ అమెరికన్లు వచ్చారు. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా అమెరికా బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా నితీష్ కుమార్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇండియన్ అమెరికన్లు అతనికి సపోర్ట్ ఇచ్చారు. ఇదే సమయంలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో అతడికి కూడా అభినందనలు తెలిపారు.. ఇక అమెరికా విధించిన లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా బ్యాటర్లకు కూడా అమెరికన్ భారతీయులు సపోర్ట్ ఇచ్చారు.. ఇలా రెండు దేశాలకు సపోర్ట్ ఇస్తూ వార్తల్లో నిలిచారు.

కష్టమైనప్పటికీ తప్పడం లేదు

“ఇది మాకు ఒకింత కష్టమైన పని. భారత్ మాకు జన్మభూమి. అమెరికా మాకు కర్మభూమి. అక్కడ పుట్టాం. ఇక్కడ ఎదుగుతున్నాం. అలాంటప్పుడు రెండు దేశాలను సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇండియా గెలిచినందుకు ఆనందంగా ఉంది. ఇదే సమయంలో అమెరికా ఓడినందుకు బాధగానూ ఉంది. మా వంతుగా మేము రెండు జట్లకు సపోర్ట్ చేశామని” అమెరికన్ భారతీయులు పేర్కొంటున్నారు. కాగా, అమెరికన్ భారతీయుల క్రీడాభిమానం పట్ల సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. క్రికెట్ పట్ల నిజమైన అభిమానాన్ని చూపిస్తున్నారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.