ATM Withdrawal Charges: ఖాతాదారులకు బ్యాంకులు త్వరలో చేదు వార్తను తెలపనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏటీఎం విత్ డ్రా చార్జీలను పెంచేందుకు ఆర్బీఐ ఎదుట ఉన్న ప్రతిపాదనను నేడో, రేపో ఆమోదించే అవకాశం ఉంది. ఎంత మేర అనేది ఆర్బీఐ చేతిలో ఉన్నా.. పెరగడం మాత్రం తప్పేలా లేదని తెలుస్తోంది.
బ్యాంకులో ఉన్న నగదు చేతిలోకి రావాలంటే మీడియేటర్ గా ఏటీఎం ఉండాల్సిందే కదా.. లేదంటే గంటల తరబడి బ్యాంకులో నిలబడి విత్ డ్రా చేసుకోవాలి. ఏటీఎం కార్డు జారీ చేసే బ్యాంకు కొన్ని ఏటీఎం లావాదేవీలను మాత్రమే ఉచితంగా అనుమతిస్తుంది. ఆ పరిధి దాటితే చార్జి వసూలు చేస్తుంది. ఒక వేళ మన కార్డు ఒక బ్యాంకుది అయి ఉండి.. మనం ఇంకో బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉప సంహరించుకుంటే ఈ బ్యాంకు ఆ బ్యాంకుకు కొంత చార్జి చెల్లిస్తుందని అది కూడా ఖాతాదారుడి నుంచే వెళ్తుంది దాన్నే ‘ఇంటర్ చేంజ్’ చార్జి అంటారు.
ఏటీఎం పరిశ్రమల సమాఖ్య (సీఏటీఎంఐ) ఏటీఎంలలో నగదు విత్‌డ్రా కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఎదుట తమ ప్రతిపాదనను పెట్టింది. ప్రతీ లావాదేవీని గరిష్టంగా రూ. 23కు పెంచాలని కోరుతోంది.
ప్రస్తుతం, బ్యాంకులు తమ ఖాతాదారులకు బెంగళూర్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నెలలో ఐదు ఉచిత లావాదేవీలను అందిస్తున్నాయి. అది ఇతర బ్యాంకుల ఏటీఎంను ఉపయోగిస్తే మూడు లావాదేవీలు ఉచితం.
ఏటీఎం తయారీ సంస్థ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఇంటర్ చేంజ్ రేటును పెంచారు. ఇప్పుడు కూడా పెంచాలని తాము ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సీఏటీఎంఐ రూ. 21కి పెంచాలని కోరగా.. మరికొందరు ఏటీఎం తయారీ దారులు రూ. 23కి పెంచాలని ప్రతిపాదించారు.
‘గతంలో దీన్ని పెంచారు. కానీ ఇప్పటికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అందరూ కలిసి పెంచాలని కోరుతున్నారని నేను భావిస్తున్నా. వారు కూడా చాలా తక్కువ మాత్రమే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.’
2021లో, ఏటీఎం లావాదేవీలపై ఇంటర్ చేంజ్ రుసుము రూ. 15 నుంచి రూ. 17కు పెంచారు. అదనంగా, ప్రతి లావాదేవీకి కస్టమర్‌కు విధించే రుసుముపై పరిమితిని రూ. 20 నుంచి రూ. 21కి పెంచారు.
మరో ఏటీఎం తయారీదారు, ‘ఇంటర్ చేంజ్ రేటును పెంచేందుకు భారీ లాబీయింగ్ జరిగింది. ఎన్‌పీసీఐ ద్వారా ప్రతిపాదనలు పంపారు. బ్యాంకులు కూడా రేటు పెంపునకు అంగీకరించాయి. ఇందులోనే కొంత ఏటీఎం తయారీ దారుకు వెళ్తుంది.’ ఇంటర్‌చేంజ్ ఫీజు పెరుగుదల అనేది ఎన్‌పీసీఐ పరిధిలో ఉంటుంది. రేటు వారే నిర్ణయిస్తారు.’