RCB Vs MI 2024: ముంబై విజయానికి..బెంగళూరు ఓటమికి కారణం అదే..

బెంగళూరు భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆ జట్టు బౌలర్లు పూర్తిగా లయ తప్పారు. ఆకాష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తలా ఒక వికెట్ పడగొట్టినప్పటికీ మహమ్మద్ సిరాజ్ దారుణంగా బౌలింగ్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 12, 2024 9:41 am

RCB Vs MI 2024

Follow us on

RCB Vs MI 2024: వరుస వైఫల్యాలకు ముంబై చెక్ పెట్టింది. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో గెలిచిన ఆ జట్టు.. గురువారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోనూ ఘనవిజయం సాధించింది. హోరాహోరి అనుకున్న మ్యాచ్.. పూర్తిగా ఏకపక్షంగా సాగడంతో ముంబై విజయాన్ని అందుకుంది. సమష్టిగా రాణించిన ముంబై ఆటగాళ్లు బెంగళూరు పై ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు.. ముంబై బౌలర్ల లో బుమ్రా నిప్పులు చెరిగాడు. బ్యాటింగ్ భాగంలో కిషన్ (34 బంతుల్లో ఏడు ఫోర్లు, ఐదు సిక్స్ లతో 69), సూర్య కుమార్ యాదవ్ (19 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 52) విధ్వంసకర ఆటతీరుతో మైదానాన్ని హోరెత్తించారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు లాస్ అయ్యి 196 రన్స్ చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్(40 బాల్స్ లో 4 ఫోర్లు, మూడు సిక్స్ లతో 61), రజత్ పాటిదార్ (26 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 50), దినేష్ కార్తీక్ (23 బంతుల్లో ఐదు ఫోర్లు, 4 సిక్స్ లతో 53*) సత్తా చాటడంతో బెంగళూరు 196 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు.. కో యిట్జీ, ఆకాశ్ మద్వాల్, శ్రేయస్ గోపాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 197 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన ముంబై జట్టు కేవలం 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. ఓపెనర్లు ఈశాన్ కిషన్, రోహిత్ శర్మ అద్భుతంగా ఆడారు. రోహిత్ 24 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 16*, హార్దిక్ పాండ్యా 21* చివరి వరకు ఉండి గెలుపు క్రతువును పూర్తి చేశారు.

బెంగళూరు భారీ స్కోరు చేసినప్పటికీ.. ఆ జట్టు బౌలర్లు పూర్తిగా లయ తప్పారు. ఆకాష్ దీప్, విజయ్ కుమార్ వైశాఖ్, విల్ జాక్స్ తలా ఒక వికెట్ పడగొట్టినప్పటికీ మహమ్మద్ సిరాజ్ దారుణంగా బౌలింగ్ చేశాడు. 37 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. బౌలర్లు చేతులు ఎత్తేయడంతో బెంగళూరు ఫీల్డర్లు మైదానంలో ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. తేమ కారణంగా మైదానం బ్యాటింగ్ కు అనుకూలించడం మొదలుపెట్టింది. దీనికి బెంగళూరు బౌలర్ల నిరాశ జనకమైన బౌలింగ్ తోడు కావడంతో ముంబై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా బెంగళూరు కీలక బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు వేసి 37 పరుగులు సమర్పించుకున్నా. ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. ముఖ్యంగా సిరాజ్ వేసిన రెండో ఓవర్ లో కిషన్ వరుసగా 6, 4, 6, 1, 6 కొట్టాడు. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ గతిని పూర్తిగా మార్చేసింది. తాజా పరాజయం బెంగళూరుకు ఐదవది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడిన బెంగళూరు కేవలం ఒకే ఒకే మ్యాచ్లో విజయం సాధించింది.