https://oktelugu.com/

Allagadda: సీమలో ‘ఫ్యాక్షన్’ వదిలేసిన ఆ రెండు కుటుంబాలు.. కారణం ఏంటంటే?

ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి టిడిపి అభ్యర్థిగా అఖిల ప్రియ పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి బరిలో దిగారు. ఇక్కడ వైసిపి స్ట్రాంగ్ గా ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : April 12, 2024 / 09:32 AM IST

    Allagadda

    Follow us on

    Allagadda: రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవు. దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ వైరం నడుస్తుంటుంది. కానీ ఇటీవల పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. క్రమేపీ ఫ్యాక్షన్ ఛాయలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు ఒక్కటయ్యాయి. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు కలిసాయి. నంద్యాల, ఆళ్లగడ్డ అంటే ముందుగా గుర్తొచ్చేది భూమా కుటుంబం. వీరికి ప్రత్యర్థిగా ఇరిగెల కుటుంబం ఉండేది. అయితే ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ను గెలిపించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆళ్లగడ్డలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

    ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి టిడిపి అభ్యర్థిగా అఖిల ప్రియ పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శబరి బరిలో దిగారు. ఇక్కడ వైసిపి స్ట్రాంగ్ గా ఉంది. ఈ తరుణంలో గెలుపు కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే భూమా, ఇరిగెల కుటుంబాలతో చర్చించి ఒక్కటయ్యేలా ఒప్పించారు. రెండు కుటుంబాలను ఏకతాటిపైకి తెచ్చారు. దీంతో మూడు దశాబ్దాల తరువాత ఆ రెండు కుటుంబాలు ఒకే గూటికి చేరినట్లు అయ్యింది.

    1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో భూమానాగిరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ప్రత్యర్థులుగా ఉన్న ఇరిగెల కుటుంబం భూమాకు మద్దతు ఇవ్వక తప్పలేదు. కానీ తరువాత రాజకీయ విభేదాలతో విడిపోయారు. అప్పటినుంచి భూమా కుటుంబం అంటే వారికి పడదు. భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడుసార్లు పోటీ చేశారు. గత ఎన్నికల్లో అఖిలప్రియకు వ్యతిరేకంగా.. వైసీపీకి మద్దతు తెలిపారు. కానీ వైసీపీలో తగినంత గుర్తింపు లేకపోవడంతో ఇరిగెల బ్రదర్స్ జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టిడిపికి కేటాయించడం, అఖిల ప్రియను టిడిపి అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఇరిగెల కుటుంబం మద్దతు అవసరమైంది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి మధ్యవర్తిత్వంతో ఆ రెండు కుటుంబాలు కలిశాయి. దీంతో ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికినట్టు అయ్యింది.