T20 World Cup 2024: మరికొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దీనికంటే ముందే పాకిస్తాన్ జట్టు ఆ దేశ ఆర్మీతో ట్రైనింగ్ తీసుకుంది. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలనే తలంపుతో ఉంది. ఈ క్రమంలో ఆ జట్టు న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో అంతంతమాత్రంగానే ఆడింది. పైగా న్యూజిలాండ్ తన “బీ టీం” తో పాకిస్థాన్ లో పర్యటించింది. అయినప్పటికీ చుక్కలు చూసింది. స్వదేశంలో అంతగా కలిసి రాకపోవడంతో.. పాకిస్తాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ దేశంలో పర్యటిస్తోంది .. నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. వర్షం వల్ల రెండు మ్యాచ్లు తుడిచిపెట్టుకుపోగా.. మరో రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ విజయం సాధించి.. దర్జాగా సిరీస్ పట్టేసుకుంది. అంతేకాదు టీ 20 వరల్డ్ కప్ ముందు అపరిమితమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది.
ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నాలుగో టి20 మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయింది. 7 వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు ముందు తలవంచింది. పాకిస్తాన్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టు లక్ష్య చేదన విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 157 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. ఉస్మాన్ ఖాన్ 38, బాబర్ అజామ్ 36 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు.. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. పవర్ ప్లే లో వికెట్ మాత్రమే నష్టపోయి 59 పరుగులు చేసింది. అయితే ఇదే జోరును చివరి వరకు పాకిస్తాన్ కొనసాగించలేకపోయింది. క్రమంగా వికెట్లు కోల్పోవడంతో అది జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం చూపించింది. పాకిస్తాన్ జట్టులో నలుగురు ఆటగాళ్లు గోల్డెన్ డక్ గా వెనుతిరిగారంటే.. ఇంగ్లాండ్ బౌలింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆర్చర్, జోర్డాన్, మోయిన్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 15.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. పాకిస్తాన్ బౌలర్లలో హరీఆ రౌఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు.. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిలిప్స్ సాల్ట్ 45 పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ బట్లర్ 39 రన్స్ తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.. ఓపెనర్లు అవుట్ అయినప్పటికీ బెయిర్ స్టో 28*, బ్రూక్ 17 పరుగులతో ఇంగ్లాండ్ జట్టును విజయ పథంలోకి మళ్ళించారు..
ఈ మ్యాచ్లో ఒక్క పాకిస్తాన్ బ్యాటర్ కూడా 50 పరుగుల మార్కు చేరుకోలేకపోయాడు . కొద్దిరోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ ఆటగాళ్ల పేలవమైన ఫామ్ ఆ జట్టును ఇబ్బందికి గురి చేస్తోంది. 4 t20 మ్యాచ్ల సిరీస్ లో.. రెండు మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి. మిగతా రెండు మ్యాచ్లలో పాకిస్తాన్ ఆల్ అవుట్ అయింది. దారుణమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ముందు తలవంచింది. అయితే ఇదే ఆటతీరు కొనసాగిస్తే టి20 వరల్డ్ కప్ సాధించడం కష్టమని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.. పాకిస్తాన్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ తీరు పూర్తిగా మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. “అమెరికా, వెస్టిండీస్ మైదానాలు ఇంగ్లాండ్ దేశాన్ని పోలి ఉంటాయి. ఇంగ్లాండు వేదికగా పాకిస్తాన్ రెండుసార్లు ఆల్ అవుట్ అయింది. ఇప్పుడు గనుక ఆట తీరు మార్చకోకపోతే.. ఇంగ్లాండ్ జట్టుతో ఎదురైన అనుభవమే పాకిస్తాన్ కు వరల్డ్ కప్ కు ఎదురవుతుందని” పాకిస్తాన్ మాజీ క్రీడాకారులు చెబుతున్నారు.