Telangana State Song: తెలంగాణ రాష్ట్ర గీతం కొత్త లిరిక్స్‌ ఇవే.. ఆ రెండు పదాలు తొలగింపు!

తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న లోగోలు ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించాలని భావిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 31, 2024 11:01 am

Telangana State Song

Follow us on

Telangana State Song: తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ రాష్ట్ర గీతం లేదు. పదేళ్లు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌ రాష్ట్రగీతాన్ని ఖరారు చేయలేకపోయింది అన్న అపవాదు మూటగట్టుకుంది. దీనిని ఎత్తి చూపడంతోపాటు రాష్ట్రగీతాన్ని ప్రకటించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి. దీనిపై దాదాపు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. అందెశ్రీ రాసిన జయ జయమే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అయితే ఈ గీతం నిడివి పెద్దగా ఉండడంతో దానిని కుదించాలని సీఎం నిర్ణయించారు. అధికారిక కార్యక్రమాల్లో పాడుకునేలా కుదించే బాధ్యతను కూడా సీఎం కవి అందెశ్రీకే అప్పగించారు. గీతానికి బాణీలు కట్టే బాధ్యతను ఆస్కార్‌ సంగీత దర్శకుడు ఎంఎం.కీరవాణికి అప్పగించారు. ఈ క్రమంలో పాట ఒరిజినల్‌ లిరిక్స్‌ను ప్రభుత్వం మార్చింది.

వాటి ప్రస్తావన లేకుండా..
తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న లోగోలు ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించాలని భావిస్తున్నారు. అవి రాచరికానికి నిదర్శనం అని ప్రకటించారు. ఉద్యమ స్ఫూర్తిని చాటేలా కొత్త లోగో రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర గీతం ఒరిజినల్‌ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన కూడా తొలగించారు. కొత్త వెర్షన్‌ పాటలో ఇవి లేకుండా రూపొందించారు. ఈమేరకు ఫైనల్‌ లిరిక్స్‌ సిద్ధం చేశారు.

ముందే చెప్పినట్లు..
తెలంగాణ లోగో, పాటలో చాచరికపు పదాలను తొలగిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే ఒరిజినల్‌ సాంగ్‌లోని కొన్ని పదాలను మార్చి కొత్త లిరిక్స్‌ తయారు చేయించారు. ఈ బాధ్యతను కీరవాణికి అప్పగించడంపైనా కొందరు రచ్చ చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి తెలంగాణ అధికారిక గీతం స్వరకల్పన బాధ్యతను అప్పగించడం ఏంటని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

రాష్ట్ర గీతంలో కొత్త లిరిక్స్‌ ఇవే..

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ..

జాన పద జనజీవన జావళీలు జాలువార
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర
అను నిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ..

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ..