NZ Vs PAK
NZ Vs PAK: దాదాపు 29 సంవత్సరాల అనంతరం పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ పేరుతో ఐసీసీ ఓ మెగా టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీలో పాక్ న్యూజిలాండ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాలలో విఫలమై ఓటమిపాలైంది. ఇక రెండో మ్యాచ్లో టీమ్ ఇండియా తో తలపడింది. ఈ మ్యాచ్ లో కూడా ఓటమిపాలైంది. ఇక చివరిగా బంగ్లాదేశ్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీంతో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా లీగ్ దశలోనే నిష్క్రమించింది. 590 కోట్లకు పైగా ఖర్చుపెట్టి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కనీసం లీగ్ దశ కూడా దాటలేకపోయింది. భారత్ ఫైనల్ వెళ్లడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెమీఫైనల్ మ్యాచ్ లు నిర్వహించడంతోనే సరిపెట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ల పై ఆ దేశ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇలా ఎందుకు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. చివరికి జట్టును ప్రక్షాళన చేయాలని భావించారు..
ప్రక్షాళన చేసినప్పటికీ
సోషల్ మీడియాలో విమర్శలు..మాజీ సీనియర్ ఆటగాళ్ల ఆరోపణల నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును మేనేజ్మెంట్ ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించింది. బాబర్ అజాం లాంటి ప్లేయర్లను పక్కన పెట్టింది. అంతేకాదు జట్టులో యువరక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆప్రయోగం కూడా సఫలం అయినట్టు కనిపించడం లేదు. కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించినప్పటికీ పాకిస్తాన్ ముఖచిత్రం మారడం లేదు.. న్యూజిలాండ్ జట్టుతో ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు వచ్చిన పాకిస్తాన్ జట్టుకు.. ఆతిధ్య న్యూజిలాండ్ చేతిలో వరుస ఓటములు ఎదురవుతున్నాయి. క్రైస్ట్ చర్చి వేదికగా జరిగిన తొలి t20 మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక రెండవ టి20 మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఆట గొప్పగా ఏమీ లేదు. 15 ఓవర్ల పాటు సాగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు బౌలింగ్ అత్యంత నాసిరకంగా కనిపించింది.. పాకిస్తాన్ విధించిన 136 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు కేవలం 13.1 ఓవర్ లోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించడం విశేషం. ఆటగాళ్లు మారినప్పటికీ.. ఆడే వేదిక మారినప్పటికీ.. పాకిస్తాన్ జట్టు ఆట తీరు మాత్రం మారడం లేదు. వరుసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోవడంతో.. న్యూజిలాండ్ జట్టు సిరీస్ పై పట్టు సాధించింది. అంతేకాదు న్యూజిలాండ్ జట్టుకు గర్వభంగాన్ని కలిగించింది. మరి ఈ నేపథ్యంలో మూడో టి20 మ్యాచ్ కైనా పాకిస్తాన్ జట్టు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా పోటీ పడుతుందా.. లేకుంటే అందులో కూడా ఓడిపోయి సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు అప్పజెప్తుందా అనేది చూడాల్సి ఉంది..