Kagiso Rabada Controversy: మొన్న యజువేంద్ర చాహల్ చేసిన వ్యవహారం అందరికీ గుర్తు ఉంది కదా. కారులో వేగంగా వెళుతూ మనోడు.. గట్టిగా నాలుగు దమ్ములు తాగాడు. అంతేకాదు సగం తాగిన తర్వాత ఆ సిగరెట్ పీకను రోడ్డు మీద పడేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో పడి సంచలనంగా మారింది. దీంతో చాహల్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అతడిని ఒక ఆట ఆడేసుకున్నారు. సెలబ్రిటీవి అయి ఉండి ఇలా సిగరెట్ తాగడానికి సిగ్గు లేదా అంటూ విమర్శించారు.
చాహల్ ఉదంతం చాలామందికి ఒక గుణపాఠం లాంటిది. ఎందుకంటే సెలబ్రిటీలు బయటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అలాకాకుండా మేమింతే.. తోపులం.. ఏదైనా చేయగలం.. ఏమైనా చేయగలము అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే నేటి కాలంలో సోషల్ మీడియా అత్యంత బలంగా ఉంది. అలాంటప్పుడు సెలబ్రెటీలు చేసే పనుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
చాహల్ చేసిన పని మర్చిపోకముందే.. గుజరాత్ ఆటగాడు రబాడా అడ్డంగా దొరికిపోయాడు. తనను ఎవరూ చూడటం లేదని భావించిన అతడు.. పని మొదలు పెట్టాడు. చివరికి దొరికిపోవడంతో ఇప్పుడు తల పట్టుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఉన్న ఇతడు 2024లో మాదక ద్రవ్యాలు స్వీకరించి దొరికిపోయాడు. చివరికి కొద్ది రోజులపాటు సస్పెన్షన్ కు గురయ్యాడు. తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్నాడు. వేగవంతంగా.. వైవిధ్యంగా బంతులు వేయడంలో ఇతడు సిద్ధహస్తుడు. గొప్ప బౌలర్ అయినప్పటికీ.. తనకున్న వ్యసనాలను నియంత్రించుకోలేకపోవడంతో ఇలా అభాసు పాలవుతున్నాడు.
సాధారణంగా క్రికెటర్ల మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు వారు యోగ.. వ్యాయామం వంటివి చేస్తూ తగ్గించుకుంటారు. కానీ రబాడ అలా కాకుండా పొగతాగడం మొదలుపెట్టాడు. అంతకుముందు మాదక ద్రవ్యాలు స్వీకరించాడు. మాదక ద్రవ్యాలు స్వీకరించినప్పుడు తనిఖీ లో దొరికిపోయాడు. చివరికి చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు ఏకంగా సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు. వాస్తవానికి వ్యసనాలను నియంత్రించుకోవాల్సిన చోట.. ఇలా బహిరంగంగా అడ్డగోలు పనులు చేయడం నిజంగా ఒక ఆటగాడికి ఏమంత గౌరవాన్ని కలిగించదు..