Jasprit Bumrah Poor Form IPL 2026: బుమ్రా.. ప్రతి జనరేషన్లో ఇలాంటి బౌలర్ ఒకడు మాత్రమే ఉంటాడు. అతడు క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను కూడా ఆడటం గొప్ప విషయం గా భావిస్తున్నాను. అతడి బౌలింగ్ చూస్తే ముచ్చటేస్తుంది. అతడు బంతులను అవలీలగా విసిరేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అతడి బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టం. అతడి వేగాన్ని అంచనా వేయకుండా ఆడితే ప్రమాదం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ.
బుమ్రా అద్భుతమైన బౌలర్. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నిప్పులు కక్కే విధంగా అతడు బంతులు వేస్తాడు. చూస్తుండగానే వికెట్లు పడగొట్టి సంచలనం కలిగిస్తాడు. అతడి ఆధ్వర్యంలో టీమిండియా బౌలింగ్ మరింత పటిష్టంగా మారింది. మిగతా బౌలర్లు చేతులెత్తేసిన సమయంలో అతడు మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. వికెట్లు తీయడం మాత్రమే కాదు.. పరుగులను కట్టడి చేసి.. ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు.. అంతటి పస ఉన్న బుమ్రా బౌలింగ్ ఎందుకిలా మారిపోయింది.. అతడు వికెట్లు ఎందుకు తీయలేకపోతున్నాడు.. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అభిమానులనే కాదు.. మిగతా వారిని కూడా ఇదే ప్రశ్న తొలుస్తోంది.
బుమ్రా ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడాడు. 122 బంతులు వేశాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. యార్కర్లు.. స్లో బౌన్సర్లు.. లో పుల్ టాస్ బంతులు వేస్తున్నప్పటికీ అతడికి వికెట్ దక్కడం లేదు. గత ఏడాది ముంబై ఇండియన్స్ ఆడిన చివరి మ్యాచ్.. ఇప్పటి నాలుగు మ్యాచ్లలో బుమ్రా కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. గత సీజన్లో పంజాబ్ జట్టు పై 0-40, 2026 లో కోల్ కతా పై 0-35, ఢిల్లీ క్యాపిటల్స్ పై 0-21, రాజస్థాన్ రాయల్స్ పై 0-32, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 0-35 గణాంకాలు నమోదు చేశాడు. ఈ ఐపీఎల్లో నాలుగు మ్యాచ్లలో అతడి ఏకంగా 122 బంతులు వేశాడు. అయినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్ కెరియర్ లో ఇన్ని బంతులు వేసినప్పటికీ.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం బుమ్రా కు ఇదే తొలిసారి.
బుమ్రా ఒక వికెట్ కూడా తీయలేకపోవడంతో రకరకాల చర్చలు స్పోర్ట్స్ సర్కిల్స్లో సాగుతున్నాయి. బుమ్రా గొప్పగా బౌలింగ్ వేసినప్పటికీ.. వికెట్ దక్కకపోవడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేగంగా బంతులు వేస్తున్నప్పటికీ.. చాకచక్యంగా ప్రత్యర్థి బ్యాటర్లు పరుగులు చేయడం బమ్రా అభిమానులకు మింగుడు పడడం లేదు. అతడి బౌలింగ్ లో పస తగ్గిందా.. ప్రత్యర్థి బ్యాటర్లు అతని లోపాన్ని గుర్తించారా.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.