Fan holding Virat Kohli's legs
IPL 2025 : ఆ మధ్య పుష్ప -2 సినిమా విడుదలైనప్పుడు ఓ కుటుంబం బెనిఫిట్ షో కోసం సంధ్య థియేటర్ కు వెళ్ళింది. బెన్ఫిట్ షో చూడనంత మాత్రాన ప్రపంచం ఏమీ మునిగిపోదు. యుగాంతం వచ్చి సర్వనాశనం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆ సినిమా చూడొచ్చు. వేలకు వేలు తగలేసి బెనిఫిట్ షో చూస్తే వచ్చే ఆనందం కూడా ఉండదు. వెర్రి అభిమానం వల్ల బెనిఫిట్ షో కి వెళ్లిన ఓ కుటుంబం లో దారుణం చోటుచేసుకుంది. ఆ ఇంటి ఇల్లాలు కన్ను మూసింది. పది సంవత్సరాల కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహా అయితే ఆ కుటుంబానికి మీడియాలో వచ్చిన వార్తల వల్ల.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల.. చిత్ర నిర్మాణ సంస్థ కొద్దో గొప్పో పరిహారం ఇవ్వచ్చు. కాకపోతే వచ్చిన ఆ పరిహారం చనిపోయిన ఆ ఇల్లాలిని తీసుకురాలేదు. చావు బతుకుల మధ్య పోరాడుతున్న ఆ బాలుడికి పాత జీవితాన్ని అందించలేదు. ఆ కుటుంబంలో ఆనందం అనే పదానికి ఇకపై చోటు ఉండదు. అలాంటి క్షణాలు.. పొందిన ఆనందాలు ఇకపై ఆ కుటుంబానికి గతమే. ఇలాంటి వెర్రి అభిమానం వల్లే చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించి పూరి జగన్నాథ్ నేనింతే అనే సినిమా తీశారు. అందులో సగటు సినిమా అభిమాని ఎంత ఇబ్బంది పడతాడో.. కళ్ళకు కట్టినట్టు చూపించారు. దాదాపు 16 సంవత్సరాల క్రితం ఇప్పటి పరిస్థితిని ఆయన ఊహించి అప్పుడు సినిమా తీశారు. ఆ సినిమా చాలామందికి నచ్చలేదు కానీ.. ఇప్పటికీ టాలీవుడ్ లో కల్ట్ సినిమాలలో అది నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది.
Also Read : హెడ్ కు తిక్క రేగితే బంతి గాల్లోనే తేలుతుంది..
సినిమా మాత్రమే కాదు..
సినిమా మాత్రమే కాదు.. క్రికెట్ లోనూ వెర్రి అభిమానులు ఉంటారు. ఉదాహరణకు శనివారం ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ప్రారంభ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు మైదానానికి వచ్చారు. సొంత డబ్బులను ఖర్చు పెట్టుకుని వారు మైదానానికి వచ్చి మ్యాచ్ చూసారు. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఓ అభిమాని.. విరాట్ కోహ్లీ మీద అమితమైన అభిమానాన్ని పెంచుకొని.. అతనితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి.. అతడి కాళ్ళు మొక్కడానికి రెడీ అయిపోయాడు. అత్యంత పటిష్టమైన ఫెన్సింగ్ ఉన్నప్పటికీ.. దాని ద్వారా అతడు గాయపడుతున్నప్పటికీ లెక్కచేయకుండా పిచ్ లోకి ప్రవేశించాడు. విరాట్ కోహ్లీ ఏదో దేవుడైనట్టు.. అతడి కాళ్ళ మీద పడ్డాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ అతడిని గుర్తించి.. వారిదైన శైలిలో సన్మానం చేశారు. సాధారణంగా ఇలాంటి వెర్రి అభిమానం వల్ల వారు మాత్రమే కాకుండా కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతుంటాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులని కాదని.. ఎవడో క్రికెటర్ మీద అభిమానం పెంచుకోవడం ఏమిటో.. అతడిని కలవడానికి.. అంతటి శాతం చేయాల్సిన అవసరం ఏమిటో ఈ తరం వారికే తెలియాలి.. ఇలాంటి ఉన్మాదమైన అభిమానం వారికే కాదు.. పక్కన ఉన్న వారికి కూడా ప్రమాదమే. ఎందుకంటే అలాంటి ఉన్మాదమైన అభిమానం ఉన్నవారు ఎలాంటి దారుణానికైనా పాల్పడతారు. శనివారం కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో విరాట్ కోహ్లీ కాళ్లు పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి చేసిన సాహసం సోషల్ మీడియాలో కనిపిస్తుంటే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంది. విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కి అతడేదో నోబెల్ బహుమతి గెలిచినంత గొప్పగా ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి వారి వల్లే అటు సినిమా నటులు.. ఇటు క్రికెటర్లు దైవంశసంభూతులుగా ఫీలవుతున్నారు. కానీ ఇలాంటి అభిమానులకు ఏదైనా కష్టం వస్తే ఏ ఒక క్రికెటర్ గాని.. ఏ ఒక్క సినీ నటుడు గాని స్పందించరు. ఎందుకంటే వారికి పైసల విలువ తెలుసు కాబట్టి.
Also Read : సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది.. ముంబై వద్దనుకుంది..సీన్ కట్ చేస్తే “ఇషాన్” దార్ సెంచరీ చేశాడు..