T20 World Cup 2024 Super 8: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తన తదుపరి ప్రయాణానికి సిద్ధమవుతోంది. లీగ్ దశలో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి రోహిత్ సేన అదరగొట్టింది. కెనడా తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఒకవేళ వర్షం కురియకపోతే ఈ మ్యాచ్ కూడా రోహిత్ సేన గెలిచేది. మొత్తానికి మూడు విజయాల ద్వారా గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో నిలిచింది. గురువారం నుంచి టీమిండియా తన సూపర్ -8 సమరాన్ని మొదలు పెడుతుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ , ఆస్ట్రేలియా జట్లతో టీమిండియా సూపర్ -8 లో తలపడుతుంది.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చిన్న జట్లే అయినప్పటికీ.. ఏమరపాటు ఏమాత్రం వద్దు. ఇప్పటికే ఆ రెండు జట్లు పెద్ద జట్లకు కోలుకోలేని షాకిచ్చాయి.
ఆఫ్ఘనిస్తాన్ తో ఆషామాషీ కాదు
ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన ఆటతీరుతో టి20 వరల్డ్ కప్ లో ఆకట్టుకుంటుంది. అన్నీ అనుకూలంగా ఉన్న రోజు అది ఎంత పెద్ద జట్టుకైనా షాక్ ఇవ్వగలదు. లీగ్ దశలో న్యూజిలాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాస్తవానికి ఈ విజయం టి20 క్రికెట్ చరిత్రలో భారీదని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ వంటి జట్టును మట్టికరిపించిందంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. కెప్టెన్ రషీద్ ఖాన్, గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా, ఓమర్జాయ్, గుల్బా దిన్ నైబ్, నబి, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్ వంటి ఆటగాళ్లు తమదైన రోజు మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయగలరు. టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గుర్బాజ్(167 పరుగులు) ముందు వరసలో కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో ఫారూఖీ(12 వికెట్లు) అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక ఈ జట్టుతో భారత్ జూన్ 20న బార్బడోస్ వేదికగా తలపడుతుంది.
బంగ్లాదేశ్ తోనూ భయమే
బంగ్లాదేశ్ జట్టును కూడా ఏమంత తీసిపారేయడానికి లేదు. గ్రూప్ – డీ లో రెండవ స్థానంలో నిలిచిన ఈ జట్టు.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి.. శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ జట్లను ఓడించి సూపర్-8 కు వచ్చేసింది. ఈ జట్టులో షకీబ్ అల్ హసన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ.. చివరి వరకు ఆ జట్టును బంగ్లాదేశ్ ఓడించింది.. ఈ జట్టు భారత్ తో మ్యాచ్ అంటే చాలు రెచ్చిపోయి ఆడుతుంది. ఈ జట్టులో షకీబ్, శాంటో, తన్జీద్, మహమదుల్లా వంటి ఆటగాళ్లను అడ్డుకుంటే చాలు భారత్ దాదాపుగా మ్యాచ్ గెలిచేసినట్టే.. బౌలింగ్ లో ముస్తాఫిజుర్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అతడిని కాచుకుంటే భారత్ భారీ స్కోరు సాధించినట్టే. మరోవైపు తస్కిన్ కూడా అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ జట్టుతో భారత్ జూన్ 22న ఆంటిగ్వా వేదికగా మ్యాచ్ ఆడనుంది.
Also Read: West Indies vs Afghanistan : వెస్టిండీస్ సరికొత్త రికార్డు..
ఆస్ట్రేలియా.. ఆటతీరు అసాధారణం
టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా జట్టు తహతహలాడుతోంది.. ఇప్పటికే ఈ జట్టు వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలు దక్కించుకొని జోరు మీద ఉంది. ఇదే దశలో టి20 వరల్డ్ కప్ కూడా దక్కించుకొని.. ఐసీసీ నిర్వహించిన మూడు మెగా టోర్నీలలో విజేతగా ఆవిర్భవించాలని తాపత్రయపడుతోంది. ఈ జట్టు లీగ్ దశలో ఇంగ్లాండ్ ను మట్టికరిపించింది. ఆ తర్వాత ఒమన్, నమీబియా, స్కాట్లాండ్ వంటి జట్లను అలవోకగా ఓడించింది.. గత వన్డే వరల్డ్ కప్ లో సెమీస్ వరకు రకరకాల ఇబ్బందులు పడిన ఆస్ట్రేలియా.. చివరి రెండు మ్యాచ్లలో అసాధారణ ఆట తీరు ప్రదర్శించింది. ఏకంగా ట్రోఫీ ని దక్కించుకుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ లోనూ అదే ఆట తీరు ప్రదర్శించింది. రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో భారత్ భంగపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పై రివేంజ్ తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది.. ఇక ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లలో వార్నర్, హెడ్ అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నారు.. స్టోయినీస్ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలింగ్లో స్టార్క్, జంపా అదరగొడుతున్నారు.. ఆస్ట్రేలియా బౌలింగ్ భీకరంగా ఉంది కాబట్టే కమిన్స్ లాంటి ఆటగాడిని రిజర్వ్ బెంచ్ పరిమితం చేసింది.. టీమిండియాతో ఆస్ట్రేలియా జూన్ 24న సెయింట్ లూసియా వేదికగా తరపడుతుంది.
Also Read: WI vs AFG : వెస్టిండీస్ దెబ్బకు ఆప్ఘాన్ విలవిల.. కనీవినీ ఎరుగని స్థాయిలో ఓటమి..
మూడు మ్యాచ్లు గెలిస్తే
ఒకవేళ టీమిండియా సూపర్ -8 పోరులో మూడు మ్యాచ్ లు గెలిస్తే.. దర్జాగా సెమిస్ వెళ్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మాత్రమే గెలిచి, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే అప్పుడు నెట్ రన్ రేట్ అత్యంత కీలకమవుతుంది. ఒకవేళ బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్ ప్రతిఘటించినప్పటికీ.. భారత్ గెలిచేందుకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక భారత జట్టుకు అత్యంత కఠిన ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఒకవేళ బంగ్లా లేదా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోతే.. భారత్ కు ఆస్ట్రేలియా తో తలపడే మ్యాచ్ ప్రీ క్వార్టర్ ఫైనల్ లా రూపాంతరం చెందుతుంది. అలా జరగకూడదనుకుంటే భారత్ వరుస విజయాలు సాధించాలి.