WI vs AFG : వెస్టిండీస్ దెబ్బకు ఆప్ఘాన్ విలవిల.. కనీవినీ ఎరుగని స్థాయిలో ఓటమి..

WI vs AFG టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆఫ్గనిస్తాన్.. వెస్టిండీస్ చేతిలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ఓటమిపాలైంది.

Written By: NARESH, Updated On : June 18, 2024 11:42 am

WI vs AFG Afghanistan lost to West Indies

Follow us on

WI vs AFG : టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జట్టుకు ఎదురులేకుండా పోతుంది. మరోసారి ఈ జట్టు ఆటగాళ్లు అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. స్వదేశంలో జరుగుతున్న టి20 వరల్డ్ కప్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి వచ్చారు. మంగళవారం సెయింట్ లూసియా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. పూరన్(98), చార్లెస్ (43), హోప్(26), పావెల్(25) దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో, నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల రాష్ట్రానికి 218 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపించింది. దీంతో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ ఏడు పరుగులకే అవుట్ అయినప్పటికీ .. వెస్టిండీస్ ఏ మాత్రం భయపడలేదు. మరో ఓపెనర్ చార్లెస్ కు, పూరన్ జత కావడంతో వెస్టిండీస్ స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ముఖ్యంగా ఆజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్లో పూరన్ ఏకంగా 36 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మైదానాన్ని హోరెత్తించాడు. మరోవైపు చార్లెస్ కూడా దూకుడుగా ఆడాడు. 47 పరుగులు చేసిన అతడు నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చార్లెస్ అవుట్ అయినప్పటికీ..మరో ఎండ్ లో పూరన్ ఉండడంతో వెస్టిండీస్ కు ఏమాత్రం భయం లేకుండా పోయింది. హోప్, పావెల్ అతడికి సహకారం అందించడంతో వెస్టిండీస్ స్కోర్ డబుల్ సెంచరీ దాటింది. దీంతో ఇప్పటివరకు జరిగిన టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా వెస్టిండీస్ రికార్డు సృష్టించింది. 98 పరుగులు చేసిన పూరన్ అజ్మతుల్లా త్రో కు రన్ అవుట్ అయ్యాడు. రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో గుల్బాదిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్, అజ్మతుల్లా చెరో వికెట్ దక్కించుకున్నారు.

219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏ దశలోనూ వెస్టిండీస్ కు పోటీ ఇవ్వలేకపోయింది. ఓపెనర్ గుర్బాజ్ పరుగులు ఏమీ చేయకుండానే అఖిల్ హోస్సేన్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. గుల్బాదిన్ నాయబ్(7), నజీబుల్లా జద్రాన్(0), మహమ్మద్ నబీ (1) వంటి ఆటగాళ్లు తేలిపోవడంతో మ్యాచ్ పై వెస్టిండీస్ జట్టుకు పట్టు లభించింది. ఇబ్రహీం జద్రాన్(38), ఓమర్జాయ్(23), రషీద్ ఖాన్(18), కరీం జనత్(14) వంటి వారు మెరిసినప్పటికీ.. ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారే గాని.. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఇక వెస్టిండీస్ బౌలర్లలో మెక్కాయి మూడు వికెట్లు పడగొట్టాడు. గుడాకేష్ మోతి 2, హోస్సేన్ రెండు వికెట్లు పడగొట్టారు. రస్సెల్, జోసెఫ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. టి20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోయిన ఆఫ్గనిస్తాన్.. వెస్టిండీస్ చేతిలో కనీ వినీ ఎరుగని స్థాయిలో ఓటమిపాలైంది.