West Indies vs Afghanistan : టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే సూపర్ -8 కు వెళ్లిన వెస్టిండీస్ జట్టు.. తన చివరి లీగ్ మ్యాచ్ లోనూ ఘన విజయం సాధించి.. లీగ్ దశను విజయవంతంగా ముగించింది. మంగళవారం సెయింట్ లూసియా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్ 98, చార్లెస్ 43, హోప్ 26, పావెల్ 25 పరుగులు చేశారు.. ఫలితంగా ఆతిధ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 98 పరుగుల వద్ద అజ్మతుల్లా విసిరిన త్రో కు పూరన్ రన్ ఔట్ అయ్యాడు. రెండు పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు.
219 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు కుప్పకూలింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ దశలోనూ విజయం వైపు అడుగులు వేయలేదు.. ఈ సీజన్లో సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ గుర్బాజ్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ 38, ఓమర్జాయ్ 23, రషీద్ ఖాన్ 18, కరీం జనత్ 14 వంటి వారు కాసేపు వెస్టిండీస్ బౌలర్లను ప్రతిఘటించారు. వీరి బ్యాటింగ్ వల్ల ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. వెస్టిండీస్ బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో ఇద్దరు గోల్డెన్ డక్, ముగ్గురు సింగిల్ డిజిట్ లకే పరిమితమయ్యారు.. వెస్టిండీస్ బౌలర్లలో మెక్కాయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. గుడాకేష్ మోతి రెండు వికెట్లు దక్కించుకున్నాడు.. హోస్సెన్ రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రస్సెల్, జోసెఫ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ విజయం ద్వారా వెస్టిండీస్ అత్యధిక పరుగుల తేడాతో నెగ్గిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో గయానా వేదికగా ఉగాండా జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇదే వరల్డ్ కప్ లో సెయింట్ లూసియా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 2014లో మీర్పూర్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 84 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. కొలంబో వేదికగా 2012లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 74 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలుపును సాధించింది. 2012లో మీర్పూర్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 73 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.