Rahul Dravid: వెళ్తూ వెళ్తూ కోహ్లీ కి కీలక బాధ్యత అప్పగించిన ద్రావిడ్

టీమిండియా కోచ్ గా వైదొలుగుతున్న నేపథ్యంలో స్టార్ బ్యాటర్ కోహ్లీకి రాహుల్ ద్రావిడ్ ఒక టార్గెట్ విధించాడు. ఇప్పటివరకు టీం ఇండియాకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలని సూచించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 2, 2024 2:14 pm

Rahul Dravid

Follow us on

Rahul Dravid: 2007లో వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఆ సమయంలో టీమిండియా కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ గ్రూప్ దశలోనే టీమిండియా ఇంటి బాట పట్టడంతో ద్రావిడ్ కన్నీటి పర్యంతమయ్యాడు.. ఆ తర్వాత తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. కొద్ది రోజులకు టీమ్ ఇండియాకు గుడ్ బై చెప్పేసాడు. ఆ తర్వాత 2021లో టీమిండియా కు హెడ్ కోచ్ గా వచ్చాడు. మూడు ఫార్మాట్ లలో టీమిండియాను నెంబర్ వన్ గా నిలిపాడు. అయితే ఇటీవల భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానానికి వెళ్లిపోయింది. ఇక ఎక్కడైతే తాను కన్నీటి పర్యంతమయ్యాడో.. ఆ వేదికగానే టీమిండియా 2024 t20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రాహుల్ ద్రావిడ్ ఆనందానికి అవధులు లేవు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ పదవి కాలం కూడా ముగిసింది..కోచ్ గా కొనసాగాలని బీసీసీఐ సెక్రెటరీ జై షా కోరినప్పటికీ ద్రావిడ్ ఒప్పుకోలేదు.

టీమిండియా కోచ్ గా వైదొలుగుతున్న నేపథ్యంలో స్టార్ బ్యాటర్ కోహ్లీకి రాహుల్ ద్రావిడ్ ఒక టార్గెట్ విధించాడు. ఇప్పటివరకు టీం ఇండియాకు అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలని సూచించాడు. ఇక కోహ్లీ కెరియర్లో వైట్ బాల్ ఛాంపియన్ షిప్ లు గెలిచిన చరిత్ర ఉంది. అండర్ 19, వన్డే, టి20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన రికార్డు విరాట్ కోహ్లీ సొంతం. అయితే కోహ్లీ కెరియర్లో మిగిలింది ఒకటే. అది రెడ్ బాల్ టెస్ట్ ఛాంపియన్ షిప్. ఆ ఉద్దేశంతోనే రాహుల్ ద్రావిడ్ ఆ టార్గెట్ కోహ్లీకి విధించి ఉంటాడని స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.. ఇక రెడ్ బాల్ ఛాంపియన్ షిప్ లో టీమిండియా విజేతగా నిలిస్తే అరుదైన రికార్డును సృష్టించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోతాడు.

ఇక టీం ఇండియా ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన నేపథ్యంలో కప్ అందుకుంటూ.. రాహు ద్రావిడ్ కన్నీటి పర్యంతమయ్యాడు. తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు.. కప్ అందుకున్న తర్వాత.. మురిసిపోయాడు. ” పోగొట్టుకున్న చోటే మీరు వెతుక్కున్నారు. ఇక మీ తదుపరి లక్ష్యం ఏమిటి” అని విలేకరులు ప్రశ్నిస్తే.. ” ప్రస్తుతానికైతే టి20 వరల్డ్ కప్ టీం ఇండియా దక్కించుకుంది. ఈ ఆనందం కొద్దిరోజుల పాటు ఉంటుంది.దీని నుంచి బయటపడిన తర్వాత సాధారణ జీవితమే ఉంటుంది. కోచ్ గా నా పదవీకాలం కూడా పూర్తయింది. ఇప్పుడు నేను ఒక నిరుద్యోగిని. నాకోసం ఏదైనా ఉద్యోగం చూడండి” అంటూ ద్రావిడ్ అక్కడున్న విలేకరులను ఉద్దేశించి చమత్కరించారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.