DC Vs LSG 2024: ఢిల్లీని గెలిపించిన జేక్ ఫ్రేజర్ గురించి ఆసక్తికర సంగతులివి..

జేక్ ఫ్రేజర్ స్వస్థలం ఆస్ట్రేలియా. ఇతడు ఏప్రిల్ 11, 2002లో జన్మించాడు. 22 సంవత్సరాల వయసున్న ఈ ఆటగాడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. లెగ్ బ్రేక్ బౌలింగ్ తో సంచనాలను సృష్టిస్తాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 13, 2024 5:37 pm

DC Vs LSG 2024

Follow us on

DC Vs LSG 2024: వరుస ఓటముల తర్వాత ఢిల్లీ జట్టు విజయాల బాట పట్టింది. లక్నో జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో పదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. బౌలింగ్లో కులదీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. బ్యాటింగ్లో జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు అంటే యమా బోరు.. సిక్సర్లు అంటేనే జోరు.. అన్నట్టుగా ఈ యువ సంచలనం బ్యాటింగ్ సాగింది. దీంతో ఒక్కసారిగా అతడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ జేక్ ఫ్రేజర్ నేపథ్యమేమిటి? ఐపీఎల్ లోకి ఎలా వచ్చాడు? ఆ స్థాయిలో బ్యాటింగ్ ఎలా చేయగలుగుతున్నాడు? వంటి విషయాలపై ప్రత్యేక కథనం.

జేక్ ఫ్రేజర్ స్వస్థలం ఆస్ట్రేలియా. ఇతడు ఏప్రిల్ 11, 2002లో జన్మించాడు. 22 సంవత్సరాల వయసున్న ఈ ఆటగాడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. లెగ్ బ్రేక్ బౌలింగ్ తో సంచనాలను సృష్టిస్తాడు. ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్లలో 51 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాలో లిస్ట్ – ఏ (మన దగ్గర రంజీ లాంటిది) క్రికెట్లో 21 మ్యాచ్లు ఆడాడు. 525 రన్స్ చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. టి20 మ్యాచ్ లలోనూ జేక్ ఫ్రేజర్ సత్తా చాటాడు. ఇప్పటిదాకా 38 మ్యాచ్లలో 700 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఎంతటి బౌలర్ అయినా భయం లేకుండా ఆడే తత్వం జేక్ ఫ్రేజర్ ది. లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ అలానే ఆడాడు.

కృనాల్ పాండ్యా వేసిన ఒక ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టాడంటే జేక్ ఫ్రేజర్ బ్యాటింగ్ శైలిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఒత్తిడిలోనూ అతడు మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు.. శుక్రవారం నాటి లక్నో జట్టుపై ఆడిన ఇన్నింగ్స్ లో 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయంటే.. అతడి బ్యాటింగ్ స్టైల్ అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగానైనా జేక్ ఫ్రేజర్ ను జట్టులోకి తీసుకున్న ఢిల్లీ యాజమాన్యం.. వచ్చే మ్యాచ్ లలో అతడిని కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. వరుస అపజయాల తర్వాత గెలుపు బాట పట్టడం.. లక్నో జట్టుతో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో జేక్ ఫ్రేజర్ పై ఢిల్లీ అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.