Phone Tapping Case
Phone Tapping Case: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. అప్పటి ప్రభుత్వంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ గా పని చేసిన రాధా కిషన్ రావు ను విచారిస్తున్న పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ సందర్భంగా విచారణ బృందం రాధా కిషన్ రావు ద్వారా కీలక అంశాలు సేకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా డబ్బు తరలించే కార్యక్రమంలో రాధా కిషన్ రావు కీలకంగా వ్యవహరించారని తేట తెల్లమైంది. భారత రాష్ట్ర సమితి చెందిన ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి కి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్టు రాధా కిషన్ రావు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం. డబ్బు రవాణాకు ఒక ఎస్ఐ ని రాధా కిషన్ రావు ఎస్కార్ట్ గా వాడుకున్నారని.. దీనికోసం అతడికి తప్పుడు సమాచారం ఇచ్చి బురిడీ కొట్టించారని దర్యాప్తులో స్పష్టమైంది.
ఎన్నికల సొమ్ము తరలింపు విషయాన్ని బయటకు చెప్పకుండా.. అత్యవసర సమయంలో అవసరమైన డబ్బును తరలించేందుకు సహకరించాలని ఎస్సైని రాధా కిషన్ రావు నమ్మించారని తెలుస్తోంది. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ, నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు అత్యవసర సొమ్మును పోలీసు వాహనాల్లో తరలిస్తున్నట్టు రాధా కిషన్ రావు సదరు ఎస్సైని నమ్మించారని సమాచారం. ఆ ఎస్సై కి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ఒక వాహనాన్ని సమకూర్చి.. అందులోనే భారీగా నగదు తరలించినట్టు తెలుస్తోంది. అలా డబ్బు తరలిస్తున్న సమయంలో రాధా కిషన్ రావు సూచనతో ఆ ఎస్సై సికింద్రాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావును కలిసినట్టు తెలుస్తోంది. ఆ ఎస్ఐ కలవడంతో.. దివ్యచరణ్ రావు ఓ వ్యక్తిని పురమాయించాడు. ఆ వ్యక్తి, ఆ ఎస్ఐ కలిసి రాణిగంజ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కోటి రూపాయలు తీసుకొని తిరిగి ఆసుపత్రికి వచ్చి దివ్య చరణ్ రావుకు అప్పగించారు. ఇదేవిధంగా మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ రావు పంపించిన వ్యక్తితో కలిసి ఆ ఎస్సై అఫ్జల్ గంజ్ వెళ్లారు. అక్కడ కూడా మరో కోటి తీసుకొని మలక్ పేటలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో దివ్య చరణ్ రావుకు అప్పగించారు.
ఇలా భారత రాష్ట్ర సమితి చెందిన ఎమ్మెల్సీ డబ్బు తరలించేందుకు ఎస్సై పలు విడతలుగా ఎస్కార్ట్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తెల్లాపూర్ ప్రాంతంలో రాజ్ పుష్ప గ్రీనో డెల్ విల్లాస్ లో ఆ ఎమ్మెల్సీ ఇంటి సమీపంలో ఉండే శివ చరణ్ రెడ్డి అలియాస్ చరణ్ ను కలవాలని రాధా కిషన్ రావు ఎస్ఐకి ఆదేశాలు జారీ చేశారు. ఆయన సూచనలతో ఆ ఎస్ఐ అలానే కలిశారు. అతడికి శివ చరణ్ రెడ్డి కొత్త ఐఫోన్, సిమ్ కార్డ్ అందించారు. ఇతర ప్రాంతాలకు నగదు తరలించే వ్యవహారానికి సంబంధించి ఆ ఫోన్లోనే రాధా కిషన్ రావు సంభాషించే వారిని తెలుస్తోంది..
అయితే ఈ వ్యవహారం ఇక్కడితోనే ఆగలేదు. ఒకసారి శివ చరణ్ రెడ్డి సూచించిన ప్రాంతానికి ఎస్ఐ వెళ్లాడు. అక్కడ కోటి రూపాయలు తీసుకొని తెల్లాపూర్ ప్రాంతంలో అప్పగించాడు. అక్టోబర్ నెలలోని మూడో వారం లో రెండు, మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు కోటి చొప్పున తీసుకొచ్చి శివ చరణ్ కు ఆ ఎస్ఐ అప్పగించాడు. అయితే ఇది తనకు అనుమానం కలిగించినప్పటికీ రాధా కిషన్ రావు ఉన్నతాధికారి కావడంతో ఎస్సై ఏమీ అనలేకపోయాడు. అయితే ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే రాధా కిషన్ రావు ను పక్కన పెట్టిందో.. అప్పుడే ఆ ఎస్ఐకి అనుమానం కలిగింది. రాధా కిషన్ రావు అడ్డమైన పనులు చేశాడని అతడికి అర్థమైంది. ఇదే క్రమంలో భారత రాష్ట్ర సమితి ఓటమి తర్వాత.. డిసెంబర్ 4న రాధా కిషన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తన రెండు ఫోన్లను ఫార్మాట్ చేశారు. అయితే దర్యాప్తు బృందం ఆ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.. వాటినుంచి డాటా సేకరించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఆ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ రాధా కిషన్ రావుకు బాల్య స్నేహితుడు కావడంతో.. ఎన్నికల సమయంలో డబ్బు తరలించేందుకు ఎస్సైని ఎస్కార్ట్ గా పంపినట్టు తెలుస్తోంది.