Kuldeep Yadav vs Ravindra Jadeja: పేస్ బౌలర్లకు పిచ్ నుంచి సపోర్ట్ లభించనప్పుడు.. కచ్చితంగా స్పిన్ బౌలర్లు పిచ్ నుంచి సపోర్ట్ లభించేలా చేస్తారు. బంతిని మెలికలు తిప్పుతారు. బంతి పాతబడినా సరే సరైన స్పిన్ రాబడతారు. అందువల్లే సుదీర్ఘ ఫార్మాట్ ఆడుతున్నప్పుడు కచ్చితంగా జట్టులో ఇద్దరు అనుభవం ఉన్న స్పిన్నర్లు ఉండాలి. గతంలో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తో రంగంలోకి దిగేది. అవసరమైతే మరో స్పిన్ ఆల్ రౌండర్ ను జట్టులోకి తీసుకునేది. ఎందుకంటే సుదీర్ఘ ఫార్మాట్లో బౌలింగ్లో వైవిధ్యం ఉండాలి. అన్ని సందర్భాలలో పేస్ బౌలర్లను నమ్ముకుంటే పని జరగదు. అయితే టీమిండియా పాటిస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వదిలి వేసినట్టు కనిపిస్తోంది. అందువల్లే టీమిండియా గెలవాల్సిన తొలి టెస్ట్ లో ఓడిపోయింది.
Also Read: బుమ్రా ను జాకీలు పెట్టి లేపింది చాలుగాని.. ఇప్పటికైనా సిరాజ్ ను గుర్తించండి..
రవిచంద్రన్ అశ్విన్ శాశ్వత వీడ్కోలు తర్వాత.. టీమిండియాకు ఒక స్పిన్నర్ అవసరం పడింది. అయితే అశ్విన్ స్థానాన్ని కులదీప్ యాదవ్ తో భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కులదీప్ కు చోటు లభించడం లేదు. అతడు జట్టులో ఉన్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం ఆడలేక పోతున్నాడు. రవీంద్ర జడేజా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్ ద్వారా ఆకట్టుకున్నప్పటికీ.. బౌలింగ్లో మాత్రం తన పూర్వపులయను అందుకోలేకపోయాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ పర్వాలేదని స్థాయిలో చేసినప్పటికీ.. బౌలింగ్ మాత్రం అంతగా చేయలేకపోయాడు. వాస్తవానికి ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఒక టెస్ట్ పూర్తయింది. మరొక టెస్ట్ జరుగుతోంది. బంతి కొత్తగా ఉన్నంతవరకు పేస్ బౌలర్లు సత్తా చూపిస్తున్నారు. బంతి పాతపడిన తర్వాత తేలిపోతున్నారు. ఇంగ్లాండ్ తోని ఇన్నింగ్స్ లో జరిగింది కూడా అదే. 81 పరుగుల వరకు 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆరో వికెట్ కు ఏకంగా 303 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఓవర్ కు అయిదు చొప్పున పరుగులను తీసింది. ఈ దశలో బంతి పాతగా మారిపోవడం.. కొత్త బంతిని ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో భారత బౌలర్లు చేతులెత్తేశారు. వాస్తవానికి ఈ సమయంలో రవీంద్ర జడేజా కు తోడుగా మరో అనుభవం ఉన్న స్పిన్నర్ ఉండి ఉంటే ఇంగ్లాండ్ ఆ స్థాయిలో స్కోర్ చేసేది కాదు. బంతి పాతబడినప్పుడు.. దాని మీదుగా గ్రిప్ సంపాదించడంలో కులదీప్ యాదవ్ సిద్ధహస్తుడు. కానీ అతడిని రెండో టెస్టులో ఆడించలేదు. ఫలితంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు పండగ చేసుకున్నారు.
Also Read: బ్రూక్, స్మిత్.. 303 పరుగులు..ఇది కదా బజ్ బాల్ గేమ్ అంటే..గిల్ సేనకు ఏడుపొకటే తక్కువ!
ఇక ప్రస్తుతం ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న టెస్టులో గిల్ బృందం 244 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మీద టీం ఇండియాకు పట్టు లభించినప్పటికీ.. ఇంగ్లాండ్ అంత సులువుగా ఈ మ్యాచ్ వదులుకోదు. ఎందుకంటే బజ్ బాల్ గేమ్ ద్వారా ఇంగ్లాండ్ ప్లేయర్లు అద్భుతాలను సృష్టిస్తారు. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పరుగులు చేసి విజయాలు సాధిస్తారు. గతంలో పాకిస్తాన్ మీద ఒక్కరోజులోనే 600 పరుగులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇలాంటప్పుడు భారత్ ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములాను అమలు చేస్తే బాగుండేది. జట్టు మేనేజ్మెంట్ కేవలం రవీంద్ర జడేజాను మాత్రమే నమ్ముతోంది. ఆల్ రౌండర్ అనే పేరుతో కీలకమైన బౌలర్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తోంది. తద్వారా వికెట్లు లభించకపోవడంతో భారత్ గెలవాల్సిన మ్యాచ్లను ఓడిపోతోంది. ఇప్పటికైనా కులదీప్ ను మూడో టెస్టులో తుది జట్టులోకి తీసుకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. కులదీప్ యాదవ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం తెలివి తక్కువ నిర్ణయని అభిప్రాయపడుతున్నారు.